చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఒక యువకుడు చేసిన అసభ్యకర పని అతని ప్రాణం తీసింది. ఆటోలో వెళ్తూ రోడ్డుపై వెళ్తున్న మహిళపై మూత్ర విసర్జన చేసినందుకు ఆగ్రహించిన జనం సదరు యువకుడిని కొట్టి చంపారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలైసెల్వన్ (30) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్నాడు.
ఆ సమయంలో కలైసెల్వన్ మద్యం సేవించి ఉన్నాడు. ఆ మత్తులో ప్రయాణిస్తున్న ఆటో నుంచే రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళపై అతను మూత్ర విసర్జన చేశాడు. ఈ వికృత చేష్టతో సదరు మహిళ ఆ యువకుడిని నిలదీయగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. యువకుడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనం ఒక్కసారిగా అతనిపై దాడికి దిగారు.
గుంపుగా చేరి విచక్షణారహితంగా కొట్టడంతో కలైసెల్వన్ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: