ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పరిపాలన సంస్కరణలే లక్ష్యంగా సుదీర్ఘంగా చర్చించి అనేక అంశాలను ఆమోదించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా సుస్థిరం చేసేలా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, న్యాయవ్యవస్థను బలోపేతం చేస్తూ 96 కొత్త కోర్టులు, 1730 ఉద్యోగాలను సృష్టించడం, వడ్డెర సామాజిక వర్గానికి క్వారీల్లో రిజర్వేషన్లు, ఆస్తిపన్ను వడ్డీ మాఫీ వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు.
అమరావతికే శాశ్వత రాజధాని హోదా!
అమరావతి రాజధాని విషయంలో భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ సవరణ ద్వారా సెక్షన్ 5(2)లో “ఎట్ అమరావతి” అనే పదాన్ని, అలాగే అమరావతి అంటే ఏపీసీఆర్‌డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతం అని స్పష్టంగా చేర్చాలని ప్రతిపాదించారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో సృష్టించిన గందరగోళం పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజకీయ కక్ష సాధింపులతో రాజధానిని మార్చే దుశ్చర్యలకు పాల్పడకుండా, అమరావతిని శాశ్వత రాజధానిగా, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి వివరించారు.
న్యాయవ్యవస్థ బలోపేతం దిశగా కీలక అడుగు
రాష్ట్రంలో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. హైకోర్టు ప్రతిపాదన మేరకు రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టులను (అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, సివిల్ జడ్జ్ కోర్టులు) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ కోర్టుల నిర్వహణకు అవసరమైన 1,730 కొత్త పోస్టుల సృష్టికి కూడా ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలనే నిబంధన, ఐదేళ్లకు మించి కేసులు పెండింగ్‌లో ఉండకూడదనే ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019లో ఒక్కో జడ్జిపై 963 కేసుల భారం ఉండగా, 2025 నాటికి అది 1,474 కేసులకు పెరిగిన విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ 1,730 పోస్టులను త్వరలో విడుదల చేసే జాబ్ క్యాలెండర్‌లో చేర్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
వడ్డెరలకు చేయూత.. బీసీ వర్గాలకు ప్రోత్సాహం
బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం, వడ్డెర సామాజిక వర్గానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు చారిత్రక నిర్ణయం తీసుకుంది. వడ్డెర సంఘాలకు క్వారీ లీజులను ప్రాధాన్యత ప్రాతిపదికన కేటాయించడంతో పాటు, ప్రీమియం, సీనరేజ్ ఫీజులో 50% రాయితీ ఇవ్వడానికి రూపొందించిన మార్గదర్శకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వారీల్లో 15 శాతం వారికి రిజర్వ్ చేయనున్నారు. అనాదిగా మట్టి, రాతి పనులపై ఆధారపడి జీవిస్తున్న వారి వృత్తిని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, అవసరమైతే వారికి పరికరాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించేలా కూడా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని మంత్రి పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు.. కీలక అనుమతులు
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు ఫేజ్-1లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి, పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నిర్మాణంలో పెరిగిన అంచనా వ్యయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలోని గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కింద 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల నిర్వహణకు రూ.4.40 కోట్లు మంజూరు చేసింది.
పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం భూసేకరణలో భాగంగా భూమి ధరను ఎకరాకు రూ.4.20 లక్షలకు పెంచారు. దీనివల్ల రైతులకు ఎకరాకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పరిహారం అందనుంది. ఇందుకోసం రూ.565 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
ఇంధన రంగంలో భారీ సంస్కరణలు, భూ కేటాయింపులు
ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పైపుడ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీపం పథకం కింద ఇచ్చే రూ.2,400 సబ్సిడీని పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న వారికి కూడా డీబీటీ ద్వారా ఆరు వాయిదాల్లో అందించనున్నారు.
నంద్యాల జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎకోరియన్ ఎనర్జీ సంస్థకు ప్రభుత్వ భూములను లీజుకు కేటాయించారు. అలాగే కడప, కర్నూలు జిల్లాల్లో 1000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కుల ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు.
ఆస్తిపన్ను వడ్డీ మాఫీ.. కోచింగ్ సెంటర్లపై నియంత్రణ
ప్రజలకు ఊరట కల్గిస్తూ పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో ఆస్తిపన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీని ఒకేసారి మాఫీ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. దీనివల్ల 123 మున్సిపాలిటీల్లో రూ.2,409 కోట్ల బకాయిల వసూలు సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని “ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్-2026” ముసాయిదాకు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం అన్ని కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి, కనీస మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు పాటించాలి, విద్యార్థులకు కౌన్సిలింగ్ సేవలు అందించాలి. ఇవే కాకుండా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ భవన నిర్మాణానికి అనుమతి, పలు చోట్ల భూ కేటాయింపులు వంటి ఇతర నిర్ణయాలను కూడా మంత్రిమండలి ఆమోదించింది.