తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచితో పాటు చెడును కూడా చెబుతానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశానని, ఆ పార్టీ తనకు మంత్రి పదవి ఇచ్చిందని, అలాగే 5 సీబీఐ కేసులు కూడా పెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సీతక్క… కేసీఆర్ కుటుంబాన్ని, తనను పదేపదే తిడుతున్నారని ఆరోపించారు. అలా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషపడతారేమో… అందుకే తమను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని విమర్శించారు. సీతక్క కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తన మీద రేవంత్ రెడ్డి కామెంట్ చేసేవరకు తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి మేం సేవలు చేయలేదా అని ప్రశ్నించారు. పార్టీ చేసిన మంచితో పాటు చెడును కూడా చెబుతామని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని దెబ్బతీయడానికి తనపై ఐదు సీబీఐ కేసులు పెట్టారని ఆరోపించారు. ఆ రోజు తాను ఒక్కమాట మాట్లాడలేదని అన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వని సమయంలోనూ మాట్లాడలేదని తెలిపారు.
వ్యక్తిగతంగా తమను లక్ష్యంగా చేసుకోవడానికి వారికి చాలా వేదికలు ఉన్నాయని, కానీ శాసనసభలో ప్రజాసమస్యలపై మాట్లాడుదామని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి తన గురించి మాట్లాడారని, అందుకే తాను కాంగ్రెస్ గురించి మాట్లాడవలసి వస్తోందని అన్నారు.