సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించి, ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుని, చివరికి ఉగ్రవాద కార్యకలాపాల్లో చిక్కుకున్న సయీదా బేగం కథ ఇది. పాతబస్తీ చంచల్‌గూడకు చెందిన 38 ఏళ్ల సయీదా బేగం, తెలియక ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కుకుందా లేక వలపు వలకు బలైందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
పదేళ్ల క్రితం విజయవాడకు చెందిన వ్యక్తితో సయీదాకు వివాహం జరిగింది. కానీ, మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధించడంతో ఏడాది క్రితం ఆరేళ్ల కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఇక్కడ స్థానికంగా ఇళ్లలో పనిచేస్తూ, తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచింది. ఈ క్రమంలో తనలోని గజల్స్ పాడే నైపుణ్యాన్ని, వంటలు, కుట్టుపనులను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రూపంలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. అనతికాలంలోనే ఆమెకు 30 వేల మంది ఫాలోవర్లు అయ్యారు. రీల్స్ ద్వారా డబ్బులు కూడా వస్తుండటంతో దాన్నే ఆదాయ మార్గంగా మార్చుకుంది.
క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి, రెండో పెళ్లి చేసుకోవాలని సయీదాపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో, తనకు ఒక తోడు కావాలంటూ సయిదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఇదే అదనుగా భావించిన విజయవాడకు చెందిన ఓ ఉగ్రవాది, తాను పోలీసునంటూ పరిచయం చేసుకున్నాడు. తన భార్యతో గొడవలున్నాయని, ఆమెను వదిలేసి తననే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన సయీదా రోజూ వాట్సాప్‌లో చాటింగ్ చేసేది.
సయీదాకు ఉన్న సోషల్ మీడియా ప్రభావాన్ని గమనించిన ఆ ఉగ్రవాది ఆమెను తమ కార్యకలాపాలకు ఒక అస్త్రంగా వాడుకోవాలని ప్లాన్ చేశాడు. ఆమెను కలిసి మాటలతో ఆకట్టుకుని, తమ ఉగ్రవాద సందేశాలను ఆమె ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రచారం చేసేలా ఒప్పించాడు. విదేశీ హ్యాండ్లర్ అల్-హకీమ్ షుక్రూ మార్గదర్శకత్వంలో ఆమె సుమారు 7 రాష్ట్రాలకు చెందిన 42 మందితో ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి తీవ్రవాద ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
ఆమె కార్యకలాపాలపై నిఘా పెట్టిన విజయవాడ పోలీసులు, ఇటీవల సయీదా బేగంను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టుకు ముందు ఆమె తల్లిదండ్రులు ఒక పెళ్లి సంబంధం తీసుకురాగా, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే షరతుతో ఆమె కొన్ని మెసేజ్‌లు, రీల్స్‌ను డిలీట్ చేసినట్లు సమాచారం.