తెలుగు రాష్ట్రాలు

ఏపీ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి ఆగ్రహం…

మా పంటలు ఎండిపోతుంటే అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారా?:

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే మీరు విద్యుత్ ఉత్పత్తి ఎలా చేస్తారని ఏపీ సర్కారును ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని జూపల్లి గుర్తు చేశారు. “ఉమ్మడి రాష్ట్రంలో 2012లో కూడా ఇలాగే అక్రమంగా నీటిని తరలించుకుపోయారు. నాడు మేము ధర్నా చేసి, హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పంథాను ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోంది” అని ఆయన విమర్శించారు.
శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణకు 64 శాతం వాటా ఉందని, రైతుల హక్కులను కాలరాస్తే ఊరుకోబోమని జూపల్లి హెచ్చరించారు. “నీటి కేటాయింపులపై స్పష్టమైన జీవోలు ఉన్నాయి. సమాచారం అందలేదని చెప్పడానికి మీరేమైనా చదువురాని వాళ్లా?” అని ఆయన ఏపీ పాలకులను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని, ఏపీ కూడా చట్టప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలంలో నీటి దోపిడీని పట్టించుకోకపోవడం వల్లే, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అలుసుగా తీసుకుంటోందని జూపల్లి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అక్రమంగా నీటిని తరలించడం ఆపకపోతే.. రైతాంగం, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమష్టిగా పోరాటం చేసి తమ హక్కులను కాపాడుకుంటామని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. నీటి వాటాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

Related posts

అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత… విద్యార్థి సంఘాల ఆందోళన

Ram Narayana

హైద్రాబాద్ నగరానికి తిరుగుప్రయాణమైన ప్రజలు …టోల్ ప్లాజాల వద్ద వాహనాల బారులు!

Ram Narayana

కర్నూలు బస్సు ప్రమాదం: మాట మార్చిన రెండో డ్రైవర్ శివనారాయణ!

Ram Narayana