Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కుప్పం నియోజకవర్గంలో వింత శబ్దాలు… హడలిపోయిన ప్రజలు

కుప్పం నియోజకవర్గంలో వింత శబ్దాలు… హడలిపోయిన ప్రజలు
-రామకుప్పం మండలంలో భారీ శబ్దాలు
-ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన ప్రజలు
-శబ్దాలు భూమిలోంచి వస్తున్నట్టు గుర్తింపు
-బెంగళూరులోనూ వింత శబ్దాలు
-వరదలు తగ్గిన తర్వాత తిరుపతి ప్రజలకు కొత్త సమస్యలు!
-భూమిలోంచి పైకిలేచిన ట్యాంకు
-పలు ఇళ్లకు బీటలు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు వింత శబ్దాలతో హడలిపోయారు. ముఖ్యంగా రామకుప్పం మండలంలోని పలు గ్రామాల ప్రజలు వింత శబ్దాలతో ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోంచి బయటికి వచ్చి పరుగులు తీశారు. ఈ శబ్దాలు భూమిలోంచి వస్తున్నట్టు గుర్తించారు. గడ్డూరు, దేసినాయనపల్లి, చిన్న గెరెగెపల్లి, పెద్ద గెరెగెపల్లి, యానాది కాలనీల్లో ఈ శబ్దాలు వినిపించాయి.

కాగా, భారీ శబ్దాలు వస్తూనే ఉండడంతో ప్రజలు మళ్లీ ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడ్డారు. వారికి రామకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు.

అటు, కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోనూ వింత శబ్దాలతో ప్రజలు భయకంపితులయ్యారు. బెంగళూరులో గతంలోనూ వింత శబ్దాలు వినవచ్చాయి. అయితే అప్పట్లో యుద్ధ విమానాల కారణంగా ఏర్పడిన సోనిక్ బూమ్ అని భావించారు. గతేడాది ఇలాంటి శబ్దాలు రాగా, ఇవి యుద్ధ విమానం పరీక్షిస్తున్నప్పుడు వచ్చిన శబ్దాలు అని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) వెల్లడించింది.

తాజాగా మరోసారి అదే రీతిలో భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు లోనయ్యారు. నిన్న మధ్యాహ్నం ఈ భారీ శబ్దాలు రావడంతో నగరంలోని రాజరాజేశ్వరి నగర్ లో కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఇది భూకంపం కాదని కర్ణాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ వెల్లడిచింది.

తిరుపతిలో ఇటీవల భారీ వర్షాలు కురియడంతో వరదలు సంభవించాయి. అనేక కాలనీలు రోజుల తరబడి నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ప్రజలకు కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ ఇంటివద్ద నీటి ట్యాంకు భూమి లోపలి నుంచి కొన్ని అడుగుల మేర ఒక్కసారిగా పైకి లేవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎందుకిలా జరిగిందో అర్థంకాక ప్రజలు హడలిపోతున్నారు.

తాజాగా తిరుపతి శ్రీకృష్ణ నగర్ లో 18 ఇళ్లు బీటలు వారాయి. దాంతో ప్రజలు ఆ ఇళ్ల నుంచి బయటికి వచ్చేశారు. ఆ ఇళ్లు కొద్దిమేర కుంగిపోయాయని కూడా స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఈ ఘటనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం భూగర్భ శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ మధు వివరణ ఇచ్చారు. ఈ నిర్మాణాలు ఓ కాలువపై నిర్మించినట్టు తెలిసిందని, భూగర్భ పొరల్లో ఇసుక ఉన్నందున, వరద ప్రభావంతో భూగర్భ నీటి మట్టం పెరిగి ట్యాంకు పైకి లేచి ఉంటుందని వివరించారు.

Related posts

కేంద్రీయ విద్యాల‌యాల్లో ఎంపీల కోటా ర‌ద్దు…

Drukpadam

కొడుకు మృతి …కోడలికి రెండవ పెళ్లి …!

Drukpadam

సంచలనంగా మారిన సుప్రీం మాజీ జడ్జిల ,బ్యూరోక్రాట్లు బహింరంగా లేఖ!

Drukpadam

Leave a Comment