ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సల్మాన్ ఖుర్షీద్ మండిపాటు…
-కాంగ్రెస్ నాయకత్వం ఒక వ్యక్తికి మాత్రమే చెందిన దైవత్వంకాదన్న ప్రశాంత్ కిశోర్
-ప్రజాస్వామ్యం గురించి ఎవరో స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదన్న ఖుర్షీద్
-రాజకీయాలు అంటే గెలవడం మాత్రమే కాదు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ కాంగ్రెస్ పై తన బాణాలను ఎక్కు పెట్టారు. ముందు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఆయన రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీకి పనిచేస్తానని ప్రకటించిన ఆయన తరువాత కాలంలో కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోనియా , రాహుల్ ,ప్రియంకాలతో ఆయన కలిశారు. తరువాత దేశంలోని బీజేపీ యేతర నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. శరద్ పవర్ , మమతా బెనర్జీ ,జగన్ , చంద్రబాబు , కేసీఆర్ లాంటి వారితో ఆయన టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ లేని బీజేపీ ప్రత్యాన్మాయం సాధ్యం కాదని చెప్పారు. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్లు కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. దానిపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ స్పందించారు.
కాంగ్రెస్ నాయకత్వమనేది ఒక వ్యక్తికి మాత్రమే చెందిన దైవత్వం కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గత పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైందని చెప్పారు. బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ కు ఎవరు నేతృత్వం వహించాలనే విషయాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు.
దైవత్వమనేది ఒక నమ్మకమని… ప్రజాస్వామ్యం కూడా అంతేనని ఖుర్షీద్ చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి మరెవరో స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అర్థం కాకపోతే స్కూలుకు వెళ్లి మళ్లీ నేర్చుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి ప్రశాంత్ కిశోర్ చాలా ఉత్సుకతగా ఉన్నట్టున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ శ్రేణుల ప్రజాస్వామిక ఎంపిక గురించి మాట్లాడేందుకు ఆయన దైవత్వం అనే అంశాన్ని లేవనెత్తారని మండిపడ్డారు. రాజకీయాలు అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదని అన్నారు.