బీజేపీ పై తీవ్రస్వరంతో ధ్వజమెత్తిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ!
-నాతో పాటు వీళ్లందరూ హిందువులు… వాళ్లు మాత్రం హిందుత్వవాదులు
-రాజస్థాన్ లోని జైపూర్ కాంగ్రెస్ భారీ సభ
-హాజరైన సోనియా, రాహుల్
-బీజేపీపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ అగ్రనేత
-హిందుత్వ, హిందు తేడా వివరించిన వైనం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాజస్థాన్ లోని జైపూర్ లో నిర్వహించిన భారీ సభకు ఆయన తన తల్లి సోనియా గాంధీ,సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందుత్వ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ వేరు హిందుత్వం వేరని వివరించారు.
“నేను హిందువుని, వీళ్లందరూ హిందువులే.. కానీ వాళ్లు మాత్రం హిందుత్వవాదులు. అదెలాగో తాను చెబుతాను వివరించారు . మహాత్మాగాంధీ సత్యాగ్రహం పేరిట సత్యం కోసం అన్వేషించారు. కానీ నాథూరామ్ గాడ్సే ఆయన దేహంలోకి మూడు బుల్లెట్లు దింపాడు. అతడొక హిందుత్వవాది. హిందువైన ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణలో ఆసక్తి చూపుతారు. హిందుత్వవాదులు మాత్రం అధికారం కోసం వెంపర్లాడతారు. వారికి సత్యంతో పనిలేదు. హిందుత్వవాదులకు సత్యాగ్రహం అంటే అధికారం కోసం అన్వేషణ మాత్రమే” అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
“ఎవరు హిందువు?… ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ దేనికి భయపడనివాడు హిందువు. కానీ నేడు అధికారంలో ఉన్నవాళ్లు నకిలీ హిందువులు. భారత్ లో ప్రస్తుతం హిందూ రాజ్ కు బదులు హిందుత్వవాది రాజ్ నడుస్తోంది. ఈ హిందుత్వ రాజ్ ను నిర్మూలించి హిందూ రాజ్ ను తీసుకురావాల్సిన అవసరం ఉంది” అంటూ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది . వేదికపైన ఉన్న సోనియాగాంధీ సైతం రాహుల్ గాంధీ ప్రసంగానికి ఉబ్బితబ్బిబ్బు అయ్యారు.ఆమె చప్పట్లు కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరైయ్యారు. వచ్చే సంవత్సరం రాజస్థాన్ ఎన్నికలు జరగనున్నందున ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది . సభ జయప్రదం కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షతిరేకలు వ్యక్తం చేస్తున్నాయి.