జగన్ సబ్జెక్టు లేని సీఎం… మూడు రాజధానులు అంటూ కాలక్షేపం : లోకేష్
-ఆర్థిక రాజధాని విశాఖ ను జగన్ నాశనం చేస్తున్నాడు
-‘హెచ్‌ఎస్‌బీసీ’ని పూర్తిగా మూసేసిన యాజమాన్యం..
-కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి
-టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా విశాఖ
-ఇప్పుడు వెలవెలబోతోంది
సబ్జెక్టు లేని సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తున్నాడని ,అనేకరకాలుగా అభివృద్ధి చెంది రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వజామెత్తారు
విశాఖ సిరిపురం జంక్షన్‌లోని ‘హెచ్‌ఎస్‌బీసీ’ బ్యాంకు చరిత్ర పుటల్లో కలిసిపోయిందంటూ ఒక దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ కంపెనీని యాజమాన్యం పూర్తిగా మూసేసిందని, భవనం ఖాళీ అయిపోయిందని ఆ కథనంలో పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉన్న దాన్ని టీడీపీ హయాంలో ఆర్థిక రాజధాని చేస్తే దాన్ని జగన్ సర్వనాశనం చేస్తున్నాడని లోకేష్ చెప్పడంపై వైసీపీ వర్గాలు పండిపడుతున్నారు.
ఆ ప్రాంగణం ఇప్పుడు వెలవెలబోతోందనీ, అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో పేరు పొందిన హెచ్ఎస్‌బీసీ వివిధ దేశాల్లో తన బ్యాంకులకు ఇక్కడి నుంచే సేవలు అందించేదని, యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిందని అందులో పేర్కొన్నారు. ఆయా అంశాలను నారా లోకేశ్ ప్రస్తావించారు.
‘సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోంది. 15 ఏళ్ల నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్‌బీసీ మూతపడటం బాధాకరం’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనం. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు’ అని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
‘విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలి’ అని నారా లోకేశ్ సూచించారు.