హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు .. పీకలదాకా తాగి రెచ్చిపోయిన అమ్మాయి..
హైదరాబాద్‌లోని టాబ్ పబ్ వద్ద ఘటన
అమ్మాయిని సముదాయించాలని చూసిన స్నేహితులు
పలువురిపై యువతి దాడి
హైదరాబాద్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గత రాత్రి యువత సందడి చేసింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, లేజర్ షోల అందమైన నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. అయితే, కరోనా నేపథ్యంలో పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ చాలా చోట్ల వాటి ఉల్లంఘనలు జరిగాయి. పలు చోట్ల యువతీయువకులు నానా హంగామా చేసి స్థానికులకు ఇబ్బందులు సృష్టించారు. ముఖ్యంగా, పబ్బులు, బార్ల వద్ద కొందరు రెచ్చిపోయారు.
హైదరాబాద్‌లోని టాట్ పబ్ వద్ద ఓ అమ్మాయి అర్ధరాత్రి పీకలదాకా తాగి రెచ్చిపోయి హల్‌చల్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాగా తాగి ఒళ్లు తెలియని స్థితిలో ఆమె ప్రవర్తించిన తీరు విస్మయపరుస్తోంది. పబ్ సమయం ముగిశాక యువతీయువకులు బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్ నుంచి వచ్చిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో యువతి రెచ్చిపోయి ప్రత్యర్థి వర్గం వారిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఎవరు సముదాయించినా వినకుండా రౌడీలా ప్రవర్తించింది. దీంతో పబ్ నిర్వాహకులు వచ్చి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆమెను కొందరు అబ్బాయిలు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కొందరు మద్యం సీసాలు రోడ్డుపైనే పడేసి నానా యాగీ చేశారు.
పోలీసులు వచ్చి సముదాయించినా కొందరు వినిపించుకోకుండా చాలా సేపు హంగామా చేశారు. కాగా, నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లోనూ చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు దొరికిపోయారు. వారి వాహనాలు సీజ్ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు.