- ఇబ్రహీంపట్నంలోని నివాసంలో అదుపులోకి తీసుకున్న సిట్
- భారీ పోలీసు బందోబస్తు మధ్య నాటకీయ పరిణామాలు
- రాజకీయ కక్షతోనే తనను ఇరికించారన్న జోగి రమేశ్
- ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన జోగి అరెస్టు
నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం భారీ పోలీసు బలగాలతో సిట్ అధికారులు జోగి రమేశ్ ఇంటికి చేరుకున్నారు. తొలుత ఆయన అనుచరుడైన రామును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, హైడ్రామా నడుమ జోగి రమేశ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేస్తూనే జోగి రమేశ్ పోలీసు వాహనంలోకి ఎక్కారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్థనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేశ్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్థనరావు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని కీలక ఆధారంగా తీసుకుని సిట్ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.
అయితే, ఈ ఆరోపణలను జోగి రమేశ్ మొదటి నుంచి ఖండిస్తున్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అరెస్టు కావడంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు: జోగి రమేశ్ అరెస్టుపై జగన్ స్పందన

- నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
- చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్
- ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు
- సిట్ విచారణ ఒక బూటకం అని ఆరోపణ
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ను అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అని పేర్కొంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నిస్సిగ్గుగా ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
“చంద్రబాబు గారూ… మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేశ్ ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేశ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
గత 18 నెలలుగా ప్రభుత్వం మీది, పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినవారే ఉన్నారు. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని.
నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మొంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారూ.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది.
నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం?” అంటూ జగన్ ట్వీట్ చేశారు.

