Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బిజెపి నేతల్లారా ఖబడ్దార్ : మంత్రి సత్యవతి రాథోడ్ వార్నింగ్

బిజెపి నేతల్లారా ఖబడ్దార్ : మంత్రి సత్యవతి రాథోడ్ వార్నింగ్
-మీ నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే ఇక్కడ పుట్టగతులుండవు
-పగటి బిచ్చగాళ్ల పనులు మానుకోవాలి
-బిజెపి తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర రైతులకు ఇబ్బందులు
-పంజాబ్ రైతులు ప్రధానినే రోడ్డు మీద నిలబెట్టారు…మీకు అదే గతి పడుతుంది

దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బిజెపి నేతలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, ఎముకలు కొరికే చలిలో రైతులను ఏడాది పాటు ఇబ్బంది పెట్టిన దేశ ప్రధానినే పంజాబ్ లో రైతులు రోడ్డు మీద నిలబెట్టారని, మిగిలిన బిజెపి నేతలకు కూడా ఇదే గతి పడుతుందని మంత్రి హెచ్చరించారు. బిజెపి నేతలు నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే వారికి పుట్టగతులు ఉండవని వార్నింగ్ ఇచ్చారు .

రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి 50వేల కోట్ల రూపాయలను జమ చేసిన సందర్భంగా మహబూబాబాద్ లోని రైతు వేదికలో సంబరాలు నిర్వహించారు. అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు సంబరాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు. అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం, కాళేశ్వరం వంటి భారీ బహుళసార్థక ప్రాజెక్టు నిర్మించడం, రైతుబంధు, రైతు బీమా పథకాలు పెట్టడం వల్ల తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చారన్నారు. తెలంగాణ రైతుల కల్లాల్లో పుష్కలమైన ధాన్యాన్ని చూసి కండ్లు మండి, ఓర్వలేక బిజెపి నేతలు తెలంగాణ ధాన్యాన్ని కొనడం లేదని, మా రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇదే పద్దతి కొనసాగితే బిజెపికి ఇక్కడ పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.

బిజెపి నేతలు కొత్త బిచ్చగాళ్ల వలె రాష్ట్రంలో పర్యటిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, తమ రాష్ట్రంలో గెలువని నేతలు ఇక్కడ వచ్చి కోతలు కోస్తున్నారని మండిపడ్డారు.

కొట్లాడి సాధించిన తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు అసాముల వద్దకు వెళ్లి పెట్టుబడి కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని సిఎం కేసిఆర్ రైతుబంధు పథకం తీసుకొచ్చారన్నారు. రైతుబంధు పథకం కింద నాలుగు ఏళ్లలో ఎనిమిది దఫాలుగా ఇప్పటికే రైతుల ఖాతాల్లో 50,536 కోట్ల రూపాయలను జమ చేయడం అత్యంత గొప్ప విషయమన్నారు. గత నాలుగేళ్లుగా చిన్న రైతుగా ఉన్న తన ఐదెకరాలకు ప్రతిసారి 25వేల రూపాయల చొప్పున ఏడు దఫాలుగా 1,75,000 రూపాయలు వచ్చాయన్నారు.

రైతుబంధు, ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల నేడు మహబూబాబాద్ లో కూడా ధాన్యం దిగుబడి బాగా పెరిగిందన్నారు. తెలంగాణ రాకముందు 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే..ఇప్పుడు అది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుందన్నారు. రైతుబంధు కింద మొదట్లో 1,28,000 మంది ఉంటే…1,80,000 మందికి పెరిగారన్నారు. రైతుబంధు మొత్తం కూడా 125 కోట్ల రూపాయల నుంచి 220 కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు.

బిజెపి ప్రభుత్వం తెలంగాణ పథకాలను ప్రశంసిస్తూ ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర బిజెపి నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొలవరానికి నిధులు ఇస్తూ మూడేళ్లలో నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే అతీ, గతి లేదన్నారు. కనీసం రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదన్నారు.

సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏ పార్టీలు చేయని కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందన్నారు. బీజేపీ ఏమి చేసింది ప్రజలు చూశారని, రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ కు గడ్డపారతో వాతలు పెడుతారని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల్లో రైతులు నాన కష్టాలు పడితే…ఈ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. అయితే ఒకేరకమైన పంట వేయడం ద్వారా రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలని కోరారు. ధాన్యం గిట్టుబాటు ధర కేంద్రం పరిధిలో ఉండగా, కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రైతు ఆత్మ గౌరవ వేదికలుగా ఈ రైతు వేదికలు నిర్మించారన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎక్కువ వ్యవసాయం చేసే జిల్లా అని, రైతు జిల్లా అని అభివర్ణించారు. ఇక్కడి రైతు సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ జేడీ చత్రు నాయక్, పాక్స్ చైర్మన్ రంజిత్, కో ఆప్షన్ సభ్యులు పాషా, ఇతర నాయకులు, పాల్గొన్నారు.

Related posts

ఏపీకి ప్రత్యేక హోదా అంశం తొలగింపుకు జీవీఎల్ నే కారణం …ఎంపీ భరత్

Drukpadam

ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే సీఎం జగన్… కొడాలి నాని వ్యాఖ్యలు!

Drukpadam

భవానీపూర్ ఉపఎన్నిక: మమతా బెనర్జీపై పోటీ చేయనున్న ప్రియాంక టిబ్రేవాల్?,

Drukpadam

Leave a Comment