కరీంనగర్ రోడ్డు ప్రమాద ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..
100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన బాలుడు!
కారు నడిపిన 16 ఏళ్ల బాలుడు
వెంట అతడి స్నేహితులు
మైనర్ బాలుడికి కారు ఇచ్చిన తండ్రి
బాలురతోపాటు కారు ఇచ్చినందుకు నిందితుడి తండ్రి కూడా అరెస్ట్
బ్రేకుకు బదులుగా యాక్సిలేటర్ తొక్కడం వల్లే ప్రమాదం!
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా , మైనర్ బాలుడు కారు నడుపుతూ 4 గురు ప్రాణాలు బలిగొన్న సంఘటన కరీంనగర్ కామన్ దగ్గర మొన్న రాత్రి జరిగిన విషయం విదితమే …అయితే ప్రమాదం జరిగినప్పుడు కారు వేగం 100 కిలోమీటర్ల స్పీడ్ లో ఉంది.ఎలాంటి లైసెన్స్ లేని మైనర్ బాలుడు దాన్ని నడుపుతున్నాడు . అతనితో పాటు మరో ఇద్దరు 10 వ తరగతి చదువుతున్న అతని స్నేహితులు ఉన్నారు. అర్థ రాత్రిపూట కారు ఇచ్చిన తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు .పోలీసులు .
కరీంనగర్‌లోని కమాన్ సమీపంలో నిన్న తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు గుడిసెలో నిద్రిస్తున్న నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. వీరంతా కొలిమి పని చేసుకుని జీవిస్తున్న కుటుంబాలకు చెందినవారు. అందరూ బంధువులే. ప్రమాదానికి కారణమైన కారును ఓ బాలుడు నడుపుతుండగా, అందులో అతడి ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు.
ప్రమాద సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, కారుపై 9 చలాన్లు ఉన్నాయి. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న 16 ఏళ్ల బాలుడితోపాటు 17 ఏళ్ల వయసున్న అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. అలాగే, బాలుడికి కారు ఇచ్చి ప్రమాదానికి కారణమైన అతడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడైన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వెంట ఉన్న ఇద్దరు స్నేహితులు పదో తరగతి చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. స్నేహితులైన వీరంతా తరచూ కారులో షికారుకు వెళ్లేవారు. నిన్న కూడా అలాగే కారులో బయటకు వచ్చారు. పొగమంచు కురుస్తున్నా కారును వేగంగా నడిపారు. ఈ క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలేటర్‌ను బలంగా తొక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.