పాకిస్థాన్ లో ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి… 30 మంది మృతి!
- పెషావర్ నగరంలో భారీ పేలుడు
- చెల్లాచెదరుగా మృతదేహాలు
- 56 మందికి గాయాలు
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్థాన్ లో ఇటీవల కొద్దిగా శాంతి నెలకొన్నట్టు కనిపించినా, అది తాత్కాలికమేనని తాజా ఘటనతో వెల్లడైంది. పాకిస్థాన్ లోని పెషావర్ నగరంలో ఓ మసీదులో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇవాళ శుక్రవారం కావడంతో నమాజ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. మసీదు లోపలి భాగం అంతా రక్తసిక్తం అయింది. కొన్ని మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో కనిపించాయి.
ఈ పేలుడు ఘటనలో 30 మంది వరకు మరణించినట్టు భావిస్తున్నారు. 56 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పెషావర్ లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రుల వద్ద అత్యయిక స్థితి విధించారు. కాగా, మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగి ఉంటుందని పెషావర్ పోలీసు అధికారి మహ్మద్ సజ్జాద్ ఖాన్ పేర్కొన్నారు.
కాగా, పాకిస్థాన్ లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటన నేడు ప్రారంభమైంది. రావల్పిండి నగరంలో తొలి టెస్టు షురూ అయింది. వాస్తవానికి ఆసీస్ జట్టు ఉగ్రదాడుల పట్ల భయపడుతూనే పాక్ పర్యటనకు వచ్చింది. ఆసీస్ జట్టుకు పాక్ ప్రభుత్వం దేశాధినేతలకు కల్పించే భద్రతా ఏర్పాటు చేసింది. అయితే, పెషావర్ లో పేలుడు ఘటన ఆసీస్ ఆటగాళ్లను ఆందోళనకు గురిచేయడమే కాదు, పాక్ వర్గాలను కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసే అవకాశాలున్నాయి.