పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత వంటగదిపై మరింత ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో భారత్‌కు రావాల్సిన సుమారు 3.2 లక్షల టన్నుల వంట గ్యాస్ (ఎల్పీజీ) సరుకు సముద్ర మార్గంలోనే నిలిచిపోయింది.
కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం హర్మూజ్ జలసంధి సమీపంలో 22 నౌకలు చిక్కుకుపోయాయి. వీటిలో భారత్ కు ఎల్పీజీని తీసుకొస్తున్న భారీ నౌకలు కూడా ఉన్నాయి. యుద్ధ వాతావరణం నేపథ్యంలో భద్రతాపరమైన అనుమతులు లభించకపోవడంతో ఈ నౌకలు ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య ఘర్షణలు 20వ రోజుకు చేరుకున్నా ఉద్రిక్తతలు తగ్గలేదు. యుద్ధం మరికొంత కాలం కొనసాగవచ్చన్న సంకేతాలతో అంతర్జాతీయ సరఫరా మార్గాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సింహభాగం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. హర్మూజ్ మార్గంలో అంతరాయం ఇలాగే కొనసాగితే దేశీయంగా గ్యాస్ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది వంట గ్యాస్ కొరతకు, ధరల పెరుగుదలకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ సంక్షోభంపై కేంద్ర పెట్రోలియం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు దృష్టి సారించాయి. పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇంధన రవాణా, వ్యూహాత్మక నిల్వల వినియోగం వంటి అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: