తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ …ప్రోత్సహించింది చంద్రబాబు :
విలేకర్లతో చిట్ చాట్ లో తుమ్మల …
-17 సంవత్సరాలు మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పనులు చూస్తుంటే ఆనందం
–నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు ఎంతో తేడా ఉంది
–ఓడిపోయినా తనను ఎన్టీఆర్ పిలిచి బ్రదర్ నేనున్నానని అన్నారు
–తరవాత కాలంలో చంద్రబాబు ప్రోత్సాహంతో అనేక శాఖలు నిర్వహించాను
–దేవుడి ఉండిలో వేసేటప్పుడు తప్ప నేను డబ్బులను చేతులతో ముట్టలేదు
–కేసీఆర్ సహకారంతో మంత్రిగా తక్కువ సమయంలో భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తీ చేయడం గొప్ప అనుభూతి …
–భక్తరామదాసు ప్రాజెక్టు నీళ్లతో తిరుమలాయపాలెం మండల ప్రజల ఆనందం చూశాను
–సీతారామ ప్రాజెక్టు తొందరగా పూర్తీ కావాలనేది నా డ్రీం
–ప్రజాక్షేత్రంలో గెలవడమే ఇష్టం…
–ఏ ముఖ్యమంత్రి దగ్గరైన నా అభిప్రాయాలను కుండబద్దలు కొట్టాను
నాకు ఏ రాజకీయనేపథ్యం లేదు …మా కుటుంబం మొదట్లో వెంగళరావు అనుచరులుగా ఉన్నాం . ఏజన్సీ లోని మారుమూల గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను వెంగళరావు ఎన్నికల్లో జైజై అంటూ తిరిగాను … అప్పుడే ఎన్టీఆర్ సారథ్యంలో టీడీపీ ఆవిర్భావం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయింది. యువకుల్లో ఎన్టీఆర్ పార్టీ లో చేరాలనే ఉత్సాహం ఉరకలు పెట్టింది. నేను అందులో చేరడం ఎమ్మెల్యే కావడం , మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి . నా రాజకీయ జీవితానికి పునాది ఇక్కడే పడింది….ఇది నేను జీవితంలో ఊహించలేదు . టీడీపీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ … నాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ప్రాంతీయసదస్సులు పెట్టారు . అందులో భాగం అయ్యాం. అనేకమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. పుచ్చలపల్లి సుందరయ్య , గిరిప్రసాద్ , మాకినేని బసవపున్నయ్య , లావు బాలగంగాధర్ రావు , చండ్ర రాజేశ్వరరావు , దాసరి నాగభూషణరావు లాంటి వారి ప్రభావం ,రజబ్ అలీ , బోడేపూడి , మంచికంటి , లాంటి వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం కూడా రాజకీయ జీవితంపై పడిందని సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . శుక్రవారం సత్తుపల్లి సమీపంలోని బేతుపల్లి గంగారాం లోగల తన ఫామ్ హౌస్ లో విలేకర్లతో చిట్ చాట్ గా మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకున్నారు . అయితే నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు ఎంతో తేడా ఉందని తుమ్మల అభిప్రాయపడ్డారు .
తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అయితే, ప్రోత్సహించింది చంద్రబాబు అని తుమ్మల అన్నారు . తన 40 యేండ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశానని ,ఉమ్మడి రాష్ట్రంలోనూ ,తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా 17 సంవత్సరాలు పనిచేసే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ , చంద్రబాబు ,కేసీఆర్ లకు కృతజ్ఞతలు చెప్పారు . శాసనసభలోని బయట ఎప్పుడు సీఎంలకు మాట తెచ్చే పని ఎక్కడ చేయలేదని తనకు ఇష్టం లేకపోతె ముందుగానే చెప్పేవాణ్ణి అన్నారు .
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనకు తెలుగుదేశం ఏర్పడిన వెంటనే ఎన్టీఆర్ పార్టీ లో చేర్చుకొని టికెట్ ఇచ్చిన విషయాన్నీ జీవితంలో మరిచిపోలేని సంఘటన అభివర్ణించారు. ఎక్కడో గండుగులపల్లి అనే కుగ్రామంలో అరకదున్నే తాను ఎమ్మెల్యే అవుతానని కలలో కూడా అనుకోలేదని , ఎమ్మెల్యే కావడమే కాకుండా మంత్రిని కాగలిగానని అది ఎన్టీఆర్ చలవవల్లనేనని అన్నారు. మొదట్లో వందలు ,వేల రూపాయలు ఎన్నికల కోసం అప్పు చేసిన విషయం గుర్తు చేస్తూ తన అన్న తాను చేసిన అప్పును తీర్చిన విషయాన్నీ ప్రస్తావించారు . ఇప్పటికి తాను దేవుడి ఉండిలో కానుక వేసేటపుడు తప్ప నోట్లను చేతితో పట్టుకున్న దాఖలాలు లేవని ఇది నమ్మశక్యం కాకపోయినా పచ్చినిజమని తుమ్మల అన్నారు . తన డ్రైవర్ లేదా గన్ మెన్ లదగ్గరే డబ్బులు ఉంటాయని వారే బిల్లు పే చేస్తారని తెలిపారు . సాధారణ ఎన్నికలే కాకుండా జిల్లాలో 15 నుంచి 20 ఎన్నికలు నిర్వహించానని అన్నారు . అప్పుడు కూడా తన చేతినుంచి ఎక్కడ డబ్బులు ఇవ్వలేదని అన్నారు .
1983 లో టీడీపీ ఏర్పాటు తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఎన్టీఆర్ టికెట్ ఇచ్చినప్పటికీ హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయానని అన్నారు . సత్తుపల్లి ఫైట్ అంటే ఒక సీఎం తో ఫైట్ అని తాను కొండని ఢీకొన్నానని అన్నారు . ఎన్టీఆర్ సత్తుపల్లి పర్యటనకు వచ్చినట్లు అయితే మొదటిసారి ఎన్నికల్లో గెలిచేవాడినని పేర్కొన్నారు. అయినప్పటికీ ఓడిపోయిన తనను ఎన్టీఆర్ పిలిచి బ్రదర్ నేనున్నానని పక్కన కుర్చోబెట్టుకొని భరోసా ఇచ్చారని నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు . రెండు సంవత్సరాల కాలంలోనే రాజకీయాలు అతివేగంగా మారిపోయి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్లారని వివరించారు . 1985 ఎన్నికలు వచ్చాయి రెండవసారి తిరిగి ఎన్టీఆర్ పిలిచి తనకు బి ఫామ్ ఇవ్వడమే కాకుండా బ్రదర్ నేను సత్తుపల్లి మీ ప్రచారానికి వస్తున్నాను మీరు గెలుస్తున్నారని చెప్పారని అన్నారు . తరవాత ఎన్టీఆర్ ప్రచారానికి రావడం తాను గెలవడం జరిగిందన్నారు . గెలిచిన ఎమ్మెల్యేలను వెంటనే ఎన్టీఆర్ రమ్మంటున్నారని హైద్రాబాద్ నుంచి కబురు వచ్చిందని దానితో నేను బయలుదేరి తెల్లారేసరికి అక్కడకు వెళ్లి పెద్దాయనను కలిశానన్నారు . అప్పుడు బ్రదర్ మీరు మా మంత్రి వర్గంలో చేరుతున్నారు 14 వతేది ప్రమాణ స్వీకారం అని ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన మాటలు ఇప్పటికి తన చెవుల్లో గిర్రున తిరుగుతుంటాయన్నారు . అప్పుడు తన ఆనందానికి అవధులు లేవని అన్నారు .
తరవాత కాలంలో చంద్రబాబు పరిచయం, ఆయన మంత్రివర్గంలో చోటు , ప్రధాన శాఖలకు మంత్రిగా చేసిన విషయాలను తుమ్మల నెమరువేసుకున్నారు . ఒక్క ఎక్సయిజ్ శాఖ మినహా అన్ని శాఖల్లో ఇష్టంగా పనిచేశానని పేర్కొన్నారు .
తాను మొదటిసారిగా ఓడిపోయినప్పుడే ఎన్టీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారని అప్పుడే తాను దాన్ని తిరస్కరించానని అన్నారు . తనకు ప్రజాక్షేత్రంలో పోటీచేసి గెలవడమే ఇష్టమని తన అభిప్రాయాన్ని ఎన్టీఆర్ కే చెప్పానని అన్నారు . వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆధారపడి పోటీ ఉంటుందని తుమ్మల పేర్కొన్నారు . ఏ ముఖ్యమంత్రి దగ్గరైన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ,కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం తన అలవాటన్నారు .
15 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ప్రజాహితం కోసం చేసిన అనేక పనులు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు . తెలంగాణ లో కాళేశ్వరం తప్ప ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులలో తన భాగస్వామ్యం ఉన్న విషయాన్నీ గుర్తు చేశారు . గాలేరు-నగరి , హంద్రీనీవా ప్రాజెక్టులకు అప్పటి ముఖ్యమంత్రితో కలిసి శంకుస్థాపన చేశానని చెప్పారు . ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లాలో పారాలనేది నా కల అన్నారు .
ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న అక్కడ మౌలిక వసతులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ద్రుష్టి సారించాలని అన్నారు . అందుకే నీటివనరుల అభివృద్ధి రోడ్ల సౌకర్యం కోసం ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ,ఏ గ్రామం వెళ్లినా అక్కడ బడి , వైద్యం , తాగునీరు,సాగునీరు , రోడ్లు , గురించే ఆలోచించానని అన్నారు. గ్రామం నుంచి మండలానికి, అక్కడనుంచి జిల్లాకు , జిల్లా నుంచి రాష్ట్రానికి రోడ్ల సౌకర్యం బాగా ఉంటేనే కమ్యూనికేషన్ ఉంటుందని అభివృద్ధి సాధ్యం అవుతుందని అందుకోసం అధికారులతో కసరత్తులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు.
ఖమ్మం జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్లు వేయడంతో పాటు,సాగు ,తాగు నీటి సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు . తాలిపేరు , లొట్టిపిట్టల గండి, ఖమ్మం లో ప్రకాశం నగర్ బ్రిడ్జి , కూనవరం -వెంకటాపురం మధ్య శబరిపై బ్రిడ్జి , పెద్దవాగు ,పాలెంవాగు , కిన్నెరసాని ,పాలేరు పైప్ లైన్ , లాంటి అనేక పనులు చేసినట్లు తెలిపారు . ఖమ్మం నగర అభివృద్ధికి తన ప్రణాళికలే కారణమని బస్సు స్టాండ్ , రోడ్ల అభివృద్ధి , బైపాస్ రోడ్ , రైల్ ఓవర్ బ్రిడ్జిలు మంచినీటి సౌకర్యం , పటేల్ స్టేడియం , లకారం లేక్ , సీక్వెల్ రిసార్ట్స్ , డివైడర్ల ఏర్పాటు , కొత్త కలెక్టరేట్ లాంటి అభివృద్ధి పనులను ఆయన ఉదహరించారు .