ఢిల్లీలో మోదీని కలిసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కీలక వ్యాఖ్యలు!
- జాన్సన్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్
- తాను ఇంతటి గొప్ప ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదన్న బ్రిటన్ ప్రధాని
- భారత్, బ్రిటన్ మధ్య ఉన్న సత్సంబంధాలపై బోరిస్ హర్షం
- నిరంకుశ రాజ్యాల నుంచి బెదిరింపులు పెరుగుతున్నాయని వ్యాఖ్యలు
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ నుంచి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీని కలిశారు. ఆయనకు అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ… భారత ప్రభుత్వం నుంచి తనకు లభించిన ఆహ్వానంపై హర్షం వ్యక్తం చేశారు.
మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్, బ్రిటన్ మధ్య ఇప్పుడున్నంత బలంగా సత్సంబంధాలు ఇంతకు ముందు ఎన్నడూ లేవని, ఇటువంటి సమయంలో తాను భారత్‌లో పర్యటిస్తుండడం శుభ సందర్భమని బోరిస్ జాన్సన్ చెప్పారు. తాను ఇంతటి గొప్ప ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రపంచంలో తాను ఎక్కడా దీనిని పొందలేకపోవచ్చేమోనని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఉదయం కూడా బోరిస్ జాన్సన్ ట్వీట్ చేస్తూ.. తన స్నేహితుడు నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. నిరంకుశ రాజ్యాల నుంచి బెదిరింపులు పెరుగుతోన్న సమయంలో వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి అంశాల్లో ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని బోరిస్ జాన్సన్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోన్న వేళ ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, సహకారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతపై బోరిస్ జాన్సన్, నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తోనూ బోరిస్ జాన్సన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాలు మీడియా ప్రకటన విడుదల చేస్తాయి.