టీడీపీకి దివ్యవాణి రాజీనామా …ఆతర్వాత ఉపసంహరణ ….
రాజీనామా ట్వీట్ డిలీట్!… టీడీపీని వీడే ప్రసక్తే లేదన్న దివ్యవాణి!
పార్టీలో గుర్తింపు దక్కట్లేదని దివ్యవాణి ఆవేదన
ఆ క్రమంలోనే రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్
దివ్యవాణితో మాట్లాడిన బచ్చుల అర్జునుడు
సాయంత్రం మీడియాతో మాట్లాడనున్న సినీ నటి
పార్టీలో గుర్తింపు దక్కడం లేదని పేర్కొంటూ.. తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లుగా ఈ ఉదయం పోస్ట్ చేసిన ట్వీట్‌ను ఆ పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి నిమిషాల వ్యవధిలోనే తొలగించేశారు. అంతేకాకుండా తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని విస్పష్టంగా ప్రకటించారు.
వర్రా రవీందర్‌రెడ్డి పేరుతో వచ్చిన పోస్టింగ్ ఆధారంగా రాజీనామా చేశానని దివ్యవాణి చెప్పారు. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్లుగా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ వైరల్ అయింది. మహానాడులో మాట్లాడే అవకాశం రాకపోవడంపై దివ్యవాణి రెండు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె రాజీనామా గందరగోళానికి దారితీసింది.
దివ్యవాణిని తాము సస్పెండ్ చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. గతంలోనూ కొందరు తప్పుడు పోస్ట్‌లు పెట్టారని, గతంలో అయ్యన్నను సస్పెండ్ చేసినట్లు ఫేక్ పోస్ట్‌లు పెట్టారని టీడీపీ గుర్తుచేసింది. బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది.
ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆమె తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రాజీనామా చేస్తున్నట్లు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది. దీంతో.. దివ్యవాణి టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టమైంది. అయితే.. పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని మాత్రం దివ్యవాణి స్పష్టం చేశారు.
మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆరోపణలు ‘మహానాడులో నాకు ఘోర అవమానం జరిగింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. దివ్యవాణి మాటలురాని అమ్మాయి అయితే కాదు. టీడీపీకి నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. గుర్తింపే లేదు. ఒక కళాకారుడు (ఎన్ టి ఆర్) పెట్టిన పార్టీలో నాలాంటి కళాకారులకు స్థానం లేకపోవడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైగా, “పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నాను” అంటూ దివ్యవాణి పార్టీ నాయకత్వం పట్ల తన అసమ్మతిని వ్యక్తం చేశారు. అంతటితో ఆగని ఆమె వైసీపీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ, మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని ఆమె చెప్పుకొచ్చారు.
‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో ఆమె మంగళవారం ఉదయం రాసుకొచ్చారు.