Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రపతి ఎన్నిక…ఓట్ల వివరాలు….

రేపు రాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది .ఇప్పటికే ఈ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి. ఈ ఎన్నికల్లో పాలకపక్ష అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీ చేస్తుండగా విపక్షాల నుంచి సీనియర్ నేత మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. అయితే ప్రారంభంలో ప్రతిపక్షాల
కొంత ఎడ్జ్ కనిపించినప్పటికీ బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థిని ఎన్డీఏ రంగంలోకి దిగడంతో కథ మారిపోయింది. నెమ్మది నెమ్మదిగా అత్యంత వెనుకబడిన గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్ష కూటమిలోని అనేక పార్టీలు బలపరిచాయి. అంతేకాకుండా మహారాష్ట్ర పరిణామాలు కొంత ప్రతిపక్షాలకు మైనస్ గా మారడంతో ప్రతిపక్ష శిభిరం నిరుత్సాహానికి గురైంది. అందువల్ల ముర్ము కు 60 శాతం పైగానే ఓట్లు వస్తాయని అంచనాలకు పరిశీలకులు వచ్చారు . దీంతో ఆమె ఎన్నిక లాంఛనమేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, 74(2) ప్రకారం దేశాధ్యక్షుడిగా రాష్ట్రపతికి రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలూ ఉంటాయి. దేశ రాష్ట్రపతికి రాజ్యాంగ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యూడిషియల్ అధికారాలతో పాటు అపాయింట్‌మెంట్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్‌, మిలటరీ పవర్స్ కూడా ఉంటాయి. అన్నింటినీ మించి… దేశంలో రాజకీయంగా ఎమర్జెన్సీ విధించే అధికారం, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం, ఆర్థిక అత్యవసరక స్థితి విధించే అధికారాలు ఆయనకుంటాయి. దేశంలో ఉన్న త్రివిధ దళాలకు ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. ఇప్పటి వరకూ 14మంది రాష్ట్రపతులుగా ఆ స్థానం గౌరవాన్ని ఇనుమడింపచేశారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కానుండటంతో.. కొత్త రాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైపోయింది.

రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్‌ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్‌ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మాత్రమే ఎన్నుకొంటారు.

ఓటింగ్‌ బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. ఓటింగ్‌ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే ఆ ఓటు రద్దవుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

ప్రస్తుతం ఎలక్టోరల్‌ కాలేజీలో 776  ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉంటే.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీయేకి 49%, యూపీయేకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీయే బలం కొంత ఎక్కువగానే ఉంది.

ఎలక్టోరల్‌ కాలేజ్‌ మొత్తం ఓట్ల విలువ దాదాపు 10.86లక్షలుంటే, అందులో బిజెపికి లక్షదాకా మెజారిటీ ఉంటుందనే అంచనాలున్నాయి. బిజెపికి 5.42లక్షల ఓట్లు వస్తాయని భావిస్తుంటే, విపక్షాలకు 4.49 లక్షల ఓట్లుంటాయని భావిస్తున్నారు.ఎంపీ ఓటు విలువ 700ఉంటే, ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రానికి ఒకలా ఉంటుంది. కర్నాటక ఎమ్మెల్యే ఓటు విలువ 131 ఉంటే యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 ఉంటుంది. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ అతి తక్కువగా 7మాత్రమే

ఎలక్టోరల్‌ కాలేజీలో అన్ని ఓట్లు పోలైతే, గెలవాల్సిన అభ్యర్థికి 5లక్షల 49 వేల 452 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే 13 పార్లమెంట్‌ స్థానాలు ఖాళీగా ఉంటే, రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏ ప్రత్యర్థి పార్టీలకు ఎమ్మెల్యే ఓట్లు 2.77లక్షలున్నాయి. అటు ఎన్డీఏ పార్టీలకున్న ఎమ్మెల్యేల ఓటు విలువ 2.22లక్షలు మాత్రమే. అయితే పార్లమెంట్‌ లో మాత్రం ఎన్డీఏకి 3.20 లక్షల ఓట్లుంటే, విపక్షాలకు 1.72 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయి.

ఎంపీల ఓటు విలువ అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంది. కానీ, రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంది. రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించి, వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ. దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగనణలోకి తీసుకుంటారు. దీనిప్రకారం ఏపీలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ
159. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 27,825. ఇటు తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఓట్ల విలువ 15,708.

ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే ఎంపీల ఓటు విలువ వస్తుంది. 2017లో ఎంపీ ఓటు విలువ 708ఉంది. కానీ, ఈ ఏడాది జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్‌ సభ్యుల ఓటు విలువ 700కు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌ ఈ సారి ఎన్నికల్లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ మేరకు ఓటు విలువ తగ్గనుందని సమాచారం..

ఈ లెక్కన చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో 25లోక్‌ సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలున్నాయి. అంటే మొత్తం 36మంది ఎంపీల ఓటు విలువ 25,200 అవుతుంది. అంటే ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ 53,025 కానుంది.

ఇక తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17. రాజ్యసభ స్థానాలు 7.తెలంగాణలో మొత్తం ఎంపీల సంఖ్య 24. వీరందరి ఓటు విలువ 16,800. తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ 32,508 కానుంది.

Related posts

మునుగోడు ఉప ఎన్నికకు స్టీరింగ్ కమిటీని ప్రకటించిన బీజేపీ!

Drukpadam

బీజేపీ నేతలకు పొంగులేటి రెడ్ కార్పెట్

Drukpadam

మందబలం ఉందని ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు …శాసనసభలో సీఎల్పీ నేత భట్టి …

Drukpadam

Leave a Comment