Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బ్రిటన్ ప్రధాని పీఠం పై భారత్ సంతతి వ్యక్తి రిషిసునాక్ !

బ్రిటన్ ప్రధాని పీఠం పై భారత్ సంతతి వ్యక్తి రిషిసునాక్ !
-చరిత్ర సృష్టించిన రిషి సునాక్… బ్రిటన్ నూతన ప్రధానిగా ఏకగ్రీవం
-నేడు నామినేషన్లకు తుదిగడువు
-పోటీ నుంచి తప్పుకున్న పెన్నీ మోర్డాంట్
-రేసులో రిషి సునాక్ ఒక్కరే మిగిలిన వైనం
-సునాక్ కు 188 మంది ఎంపీల బలం
-మోర్డాంట్ కు 27 మంది ఎంపీల మద్దతు

రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ చరిత్రలో ఓ ఆసియా సంతతి వ్యక్తి తొలిసారిగా ప్రధాని పీఠం అధిష్ఠించనున్నారు. భారత సంతతికి చెందిన 42 ఏళ్ల రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా ఏకగ్రీవం అయ్యారు. ప్రధాని రేసులో నిలిచిన పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి వైదొలగడంతో రిషి సునాక్ ను ప్రధాని పదవి వరించింది.

ఇవాళ కన్జర్వేటివ్ పార్టీ అధినేత ఎన్నికల నామినేషన్లకు తుది గడువు కాగా, అందుకు కొన్ని నిమిషాల ముందు తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు పెన్నీ మోర్డాంట్ ప్రకటించారు. దాంతో, ప్రధాని రేసులో రిషి సునాక్ ఒక్కరే మిగిలారు. పోటీ ఎవరూ లేకపోవడంతో బ్రిటన్ ప్రధానిగా ఆయనే ఎన్నికయ్యారు.

రిషి సునాక్ కు 188 మంది ఎంపీల మద్దతు ఉండగా, మోర్డాంట్ కు 27 మంది ఎంపీల మద్దతు ఉంది. కనీసం 100 మంది ఎంపీల మద్దతు కూడా కూడగట్టలేకపోవడంతో మోర్డాంట్ ఈ పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్… లిజ్ ట్రస్ చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. విచారకర రీతిలో లిజ్ ట్రస్ ఏడు వారాలకే ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో, మళ్లీ రేసులోకి వచ్చిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా రిషి సునాక్ జోరు ముందు నిలవలేకపోయారు.

కాగా, ఈ పరిణామాలపై బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలు జరపాల్సిందేనంటూ పునరుద్ఘాటించింది. అటు, ఈ నెల 28న రిషి సునాక్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

ఆర్థికవేత్త నుంచి ప్రధానమంత్రి దాకా… రిషి సునాక్ ప్రస్థానం ఇదిగో!

  • బ్రిటన్ లో అత్యంత పిన్న వయసు ప్రధానిగా సునాక్
  • రిషి సునాక్ కు పంజాబ్ మూలాలు
  • ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లిన సునాక్ పూర్వీకులు
  • అక్కడ్నించి బ్రిటన్ తరలి వెళ్లిన సునాక్ తల్లిదండ్రులు
  • బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో సునాక్ ఫ్యామిలీ
Rishi Sunak details
భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. 42 ఏళ్లు సునాక్ బ్రిటీష్ ప్రధాని పీఠం ఎక్కిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. గతంలో బ్రిటీష్ పాలనలో భారత్ మగ్గిపోగా… ఇప్పుడు భారత సంతతి వ్యక్తే బ్రిటన్ ను పరిపాలించనుండడం చరిత్రలో నిలిచిపోయే అంశం.

ఈ నేపథ్యంలో, రిషి సునాక్ వివరాల్లోకి వెళితే… రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్. వీరి మూలాలు పంజాబ్ లో ఉన్నాయి. వారి పూర్వీకులు టాంజానియా, కెన్యా వలస వెళ్లినట్టు తెలుస్తోంది. ఉష, యశ్వీర్ టాంజానియా, కెన్యా దేశాల నుంచి బ్రిటన్ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

రిషి సునాక్ తండ్రి యశ్వీర్ ఓ డాక్టర్ కాగా, తల్లి ఉష ఓ మెడికల్ షాపు యజమాని. రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో జన్మించారు. ఆర్థిక రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫిలాసఫీ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్ ఫర్డ్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

రిషి సునాక్ 2001-04 మధ్యకాలంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ లో అనలిస్ట్ గా పనిచేశారు. 2004 నుంచి 2015 మధ్య కాలంలో వివిధ ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో రాజకీయాలపై ఆసక్తితో కన్జర్వేటివ్ పార్టీలోకి వచ్చారు. కొత్త తరం నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రిచ్ మండ్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు.

రిషి సునాక్ కరోనా సంక్షోభ సమయంలో ఆర్థికమంత్రిగా విశిష్ట సేవలు అందించి సత్తా చాటుకున్నారు. థెరెస్సా మే, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు చేపట్టి సమర్థుడిగా గుర్తింపు పొందారు. బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు.

బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునాక్ ఫ్యామిలీ ఒకటి. వీరికి 750 మిలియన్ పౌండ్ల సంపద ఉన్నట్టు అంచనా. ఆయన క్రికెట్, సాకర్, సినిమాలు, ఫిట్ నెస్ పై మక్కువ చూపిస్తారు.

Related posts

ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన మరో కొత్త పార్టీ!

Drukpadam

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్తతలు … గ్రామాల‌ను ఖాళీ చేస్తోన్న ప్ర‌జ‌లు!

Drukpadam

పెగాసస్ సృష్టికర్తలతో ఎలాంటి లావాదేవీలు జరపలేదు: పార్లమెంటులో స్పష్టం చేసిన కేంద్రం…

Drukpadam

Leave a Comment