ఆసుపత్రిలో కరోనా పేషెంట్ మృతి.. డాక్టర్లను చితకబాదిన బంధువులు!
- ఢిల్లీ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన మహిళ
- ఐసీయూలో బెడ్ లేకపోవడంతో మృతి
- దాడిలో గాయపడ్డ డాక్టర్లు, సిబ్బంది
ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో కరోనాకు చికిత్స పొందుతున్న ఒక మహిళ (67) ఈ ఉదయం చనిపోయారు. ఆసుపత్రిలో ఐసీయూ బెడ్లు అందుబాటులో లేకపోవడంతో ఆమె మృతి చెందారు. దీంతో, ఆమె బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డాక్టర్లు, ఇతర ఆసుపత్రి సిబ్బందిని వారు చితకబాదారు. ఈ దాడిలో పలువురు డాక్టర్లు, సిబ్బంది గాయపడ్డారు. హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వారిని చితగ్గొట్టండి.. అదే కరెక్ట్’ అంటున్న అరుపులు వీడియోలో వినిపిస్తున్నాయి.
మరోవైపు గాయపడిన సిబ్బంది విధుల్లోకి రావాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లు ఉన్నారని… ప్రస్తుత తరుణంలో వారికి చికిత్స అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపింది.
దాడి జరిగిన గంట తర్వాత ఆసుపత్రికి పోలీసులు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు. విజువల్స్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.