సీఎం పదవి కోసం మా ఇద్దరి మధ్య పోటీ ఉంటే తప్పేంటి?: సిద్ధరామయ్య
- ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండడంలో తప్పులేదన్న సిద్ధరామయ్య
- ఎవరు సీఎం కావాలన్నది అంతిమంగా అధిష్ఠానం, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారన్న మాజీ సీఎం
- ఈసారి బీజేపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ విజయం తథ్యమని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే సీఎం ఎవరన్న దానిపై కాంగ్రెస్‌లో ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. సీఎం పదవి కోసం ఓ వైపు ఆ పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్, మరోవైపు మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అందరం కష్టపడి పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. సీఎం పదవి విషయంలో తనకు, పార్టీ చీఫ్ డీకే శివకుమార్‌కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. శివకుమార్ సీఎం కావాలని అనుకోవడంలో తప్పు లేదని అలాగే, తాను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించడం తప్పుకాదని స్పష్టం చేశారు. ఎవరు సీఎం కావాలన్నది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని, అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
గత ఎన్నికల్లో బీజేపీ నేతలు తనను హిందూ వ్యతిరేకిగా తప్పుడు ప్రచారం చేశారన్నారు. 2013-18 మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తనపై హిందూ వ్యతిరేక ముద్ర వేసి బీజేపీ ప్రచారం చేసిందని, అదే వారికి కలిసొచ్చిందని విమర్శించారు. అయితే, ఈసారి మాత్రం బీజేపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిద్ధరామయ్య అన్నారు.