కర్ణాటక లో అవినీతి రహిత పాలన అందిస్తాం …రాహుల్ గాంధీ
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఐదింటిని నెరవేరుస్తాం
అందుకు రెండు గంటల సమయం చాలు …
పోలీసులు ,అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది.
పేదలు, ఆదివాసీలు ,బీసీలు ఎస్సీలు మావెంట ఉన్నారు
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తుందని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. ‘‘మేం 5 వాగ్దానాలు చేశాం.. 2 గంటల్లో అమలు చేస్తాం’’ అని తెలిపారు.
ఈ రోజు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలించదంటూ వివిధ విశ్లేషణలు జరిగాయి. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు బాసటగా నిలవడం వల్లే కాంగ్రెస్ గెలుపు సాకారమైంది’’ అని తెలిపారు.
‘‘మా వెంట నిజం ఉంది.. మా వెనుక పేద ప్రజలు ఉన్నారు. కానీ బీజేపీ దగ్గర డబ్బు ఉంది.. పోలీసులు ఉన్నారు.. ప్రతిదీ వారి దగ్గర ఉంది. కానీ కర్ణాటక ప్రజలు వారిని ఓడగొట్టారు’’ అని రాహుల్ అన్నారు. విద్వేషంపై ప్రేమ గెలిచిందని రాహుల్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు మరోసారి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు 5 ప్రధాన హామీలు ఇచ్చిందని రాహుల్ గుర్తు చేశారు. ‘‘మేము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వము. ఏది చెప్పామో అదే చేస్తాం. మరో ఒకటి రెండు గంటల్లోనే కేబినెట్ తొలి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే ప్రజలకు ఇచ్చిన 5 హామీలకు చట్టబద్ధత కల్పిస్తాం’’ అని ప్రకటించారు.
సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి అతిరధులు మహారథుల రాక
కన్నడ కంఠీరవ స్టేడియం లో జరిగిన సిద్దరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో పాటు , కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , ఎన్సీపీ నేత శరద్ పవర్ , తమిళనాడు , బీహార్ , రాజస్థాన్ ,ఛత్తీస్ ఘడ్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , సిపిఎం, సిపిఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి , డి రాజా జమ్మూకాశ్మిర్ నుంచి మాబూబా ముక్తి , ఉమర్ అబ్దుల్లా , బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ , తదితరులు హాజరైయ్యారు .