మట్టా దయానంద్ కాంగ్రెస్ లో చేరిక ….సత్తుపల్లి రాజకీయాల్లో పెనుమార్పులు
గతంలో పొంగులేటి అనుచరుడిగా ఉన్న దయానంద్
ఇటీవల కాలంలో పొంగులేటికి దూరంగా ఉన్న దయానంద్
పొంగులేటి బీజేపీకి వెళతాడని ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ కు మొగ్గుచూపిన దయానంద్ …
దయానంద్ దూరం కావడంతో పంచాయతీ రాజ్ ఇ ఇ సుధాకర్ ను రంగంలోకి దింపిన పొంగులేటి
మట్టా దయానంద్ సత్తుపల్లి ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు …గతంలో సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓడిపోయారు.గత ఎన్నికల్లో టీఆర్ యస్ నుంచి పోటీచేయాలని గట్టి పట్టు పట్టారు . అయితే తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధి నాయకుడిగా ఉన్న పిడమర్తి రవికి టికెట్ ఇవ్వడంతో దయానంద్ కు ఛాన్స్ దక్కలేదు …అయితే ఆయన ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు . మొదటి నుంచి పొంగులేటి అనుచరుడిగా పేరున్న దయానంద్ జనవరి మొదటి రోజున పొంగులేటి నివాసంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో కూడా పాల్గొన్నారు. తర్వాత కాలంలో కారణాలు ఏమైనా పొంగులేటికి దూరం జరిగారు .అయితే పొంగులేటి బీజేపీలోకి వెళ్లుతున్నాడని అందుకే దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణాలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో దూరంగా ఉంటున్నారని అన్నారు .సత్తుపల్లి నుంచి పోటీచేయాలని గట్టి సంకల్పంతో ఉన్న దయానంద్ పొంగులేటి సత్తుపల్లి నుంచి తనను కాకుండా సుధాకర్ ను ప్రకటించడంతో అసంతృప్తి గా ఉన్నారు .
ఇక పొంగులేటితో ఉంటె తనకు అవకాశం ఉండదని భావించిన దయానంద్ నేరుగా హైద్రాబాద్ వెళ్లి రేణుక చౌదరిని కలిసి రేవంత్ రెడ్డి , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం థాకరే సమక్షంలో గాంధీ భవనంలో తన భార్యతో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన అనుయాయులు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
అయితే దయానంద్ కు పార్టీలో ఎలాంటి హామీ లభించిందనేది వెల్లడి కాలేదు . ఇప్పటికే మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ సత్తుపల్లి నుంచి పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు. 2014 లో సత్తుపల్లి నుంచి పోటీచేసిన సంభాని 2018 లో టీడీపీ ,కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సండ్ర వెంకట వీరయ్య కు మద్దతు ఇచ్చారు. సంభాని కాదని దయానంద్ కు టికెట్ ఇస్తారా …? అనేది చర్చనీయాంశంగా మారింది.ఒకవేళ పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే సుధాకర్ పేరునే తెరపైకి తెచ్చే అవకాశం ఉంది .అందువల్ల దయానంద్ కు వృతం చెడ్డ ఫలితం దక్కని చందంగా ఉంటుంది….