అజిత్ పవార్ తిరుగుబాటుకు తన ఆశీస్సులు వున్నాయన్న వార్తలను ఖండించిన శరద్ పవార్
- ప్రస్తుత పరిణామాలతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావొద్దని పిలుపు
- బీజేపీ దేశాన్ని చీల్చాలనుకుంటోందని పవార్ ఆగ్రహం
- ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టాలని బీజేపీ చూస్తోందని ఆరోపణ
అజిత్ పవార్ తిరుగుబాటుకు తన ఆశీస్సులు ఉన్నాయనే వాదనను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఖండించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మహారాష్ట్రలో తాజా పరిణామాలు సమాజాన్ని విభజించే ప్రయత్నంగా తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత పరిణామాలతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహనికి గురికావొద్దని పిలుపునిచ్చారు. బీజేపీ దేశాన్ని చీల్చాలనుకుంటోందని ఆరోపించారు. అలాంటి వారిని ఎదుర్కోవడానికి కార్యకర్తల బలం, మద్దతు కావాలన్నారు. రాజకీయ పరిస్థితులను బీజేపీ కలుషితం చేస్తోందన్నారు. సమయం వచ్చినప్పుడు అందరూ తమకే మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను సహించరన్నారు. ఎన్సీపీని పునర్నిర్మిస్తామని చెప్పారు. అదే సమయంలో అజిత్ పవార్ తిరుగుబాటు వెనుక తాను ఉన్నాననే ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది నీచమైన ఆరోపణ అనీ, కుత్సిత బుద్ధిగల, తెలివితక్కువ వాళ్లు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారని పవార్ అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు తాను రాష్ట్రవ్యాప్త పర్యటనను చేపడుతున్నట్లు చెప్పారు. కొంతమంది నాయకులు చేసిన చర్యలకు భయపడేది లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను అన్నింటిని తుడిచిపెట్టాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు.
శరద్ పవార్ మా జాతీయ అధ్యక్షుడు అనే విషయం మరిచారా?: అజిత్ పవార్
- మెజార్టీ ఎమ్మెల్యేలు తమవెంటే ఉన్నారన్న అజిత్
- ఎన్సీపీ పేరు, గుర్తు తమకే చెందుతాయని వ్యాఖ్య
- పవార్ కు చేతులు జోడించి వేడుకున్న ప్రఫుల్ పటేల్

అనంతరం అజిత్ పవార్ మాట్లాడుతూ… పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు తమవెంటే ఉన్నట్లు చెప్పారు. తాము ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నట్లు చెప్పారు. ఎన్సీపీ పేరు, గుర్తు తమకే చెందుతాయన్నారు. పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేదని, సాఫీగా ముందుకు సాగుతుందన్నారు.
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అని మీడియా అడగగా.. శరద్ పవార్ మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అనే విషయం మరిచిపోయారా? అని సమాధానం ఇచ్చారు.
తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని, మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేస్తానని అజిత్ పవార్ ఎన్సీపీ గ్రూప్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సునీల్ అన్నారు. మరో నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ… తమపై అనర్హత వేటు వేసే అధికారం ఎవరికీ లేదన్నారు. తాను శరద్ పవార్ కు చేతులు జోడించి అడుగుతున్నానని, మాకు మీ ఆశీస్సులు కావాలన్నారు. ఆయన మా గురువు అని వ్యాఖ్యానించారు.