వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం- బీఆర్ఎస్ ను బొంద పెడుతాం… కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి…
-హిట్లర్ ప్రభుత్వం వద్దు
-మా వేదికలు అలాంటివి కావు
– కాంగ్రెస్ లో స్వేచ్ఛ, స్వంతంత్రాలు ఎక్కువ–
– బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు
– తట్టుకోలేకే అనేక విమర్శలు చేస్తున్నారు
భయంతో కూడిన హిట్లర్ లాంటి వేదికలు తమవి కావని, ప్రజలు హిట్లర్ పాలించే ప్రభుత్వాలు కోరుకోవడం లేదని.. కాంగ్రెస్ లో స్వేచ్ఛ, స్వతంత్రాలు ఎక్కువని ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభిప్రాయ పడ్డారు. సోమవారం ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు, తన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 కాదు రాష్ట్రవ్యాప్తంగా 100 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, బీఆర్ఎస్ ను బొంద పెడుతామని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇంతకాలం పదవులు లేకున్నా ప్రజల్లోనే ఉన్నానని, అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాని తెలిపారు. అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నాకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. తాను జనంలోనే ఉన్నా కాబట్టి తనకు రిటర్న్ గిఫ్ట్ గా అంతమంది వచ్చి సభను విజయవంతం చేశారన్నారు. ఉమ్మడి జిల్లా నాయకులంతా కలిసి పనిచేశారని, వివిధ రాష్ట్రాలనుంచి సీఎంల ను రప్పించుకుని గతంలో ఇక్కడ జరిగిన బీఆర్ఎస్ సభకు.. ఇప్పుడు జరిగిన పొంగులేటి సభకు తేడా గమనించాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాకతో సభలో జోష్ పెరిగిందని, భారీకేడ్లు తోసుకుంటూ వచ్చి యువకులు రాహుల్ గాంధీ స్పీచ్ విన్నారని తెలిపారు.
అనేక ఇబ్బందులు సృష్టించారు.. అయినా..
సభకు జనాన్ని రాకుండా అధికార పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు సృష్టించారని, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారని తెలిపారు. అయినా పార్టీ మీద, తన మీద ఉన్న ప్రేమతో లక్షలాది ప్రజలు హాజరయ్యారని చెప్పారు. తన కూతురి వివాహ రిసెప్షన్ కోసం సాగర్ కాల్వ బ్రిడ్జి మీద ఏర్పాటు చేసి వంతెనను తీసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తే.. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ని ఆదుకుందామని మేము భావించి బస్సులు అడిగితే ముందు ఇస్తామని తరువాత ఇవ్వడం కుదరదని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అయినా ప్రజలు వివిధ రూపాల్లో సభకు వస్తుంటే అడ్డుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. బీఆర్ఎస్ సభలు పెడితే అధికార యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకుంటుందని, తాము సభలు పెడితే కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తుంటే పోలీసులు సభ వద్ద ఉండకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ కాపలాగా ఉన్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ సభకు వస్తుంటే ముఖ్యమంత్రి, డీజీపీ, సీపీ ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ దుయ్యబట్టారు. సభ సక్సెస్ అయిందని అన్ని పత్రికలు, చానళ్లలో పేర్కొంటే.. అధికార పత్రిక, ఛానల్ మాత్రం కరపత్రంలా మారి కల్పిత కథలతో వారికి అనుకూలంగా డబ్బా కొట్టుకుందన్నారు.
వారికి కంటివెలుగు అద్దాలు అవసరం..
అధికార పార్టీలో తనకు సరైన గౌరవం లభించడం లేదని ఓ మంత్రి షిండే అవతారం ఎత్తుదామని ప్రయత్నించడం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పింఛన్ పెంచాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారని వారి సలహాలు తీసుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదని అభిప్రాయపడ్డారు. అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రానున్న కాలంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని తాము చెప్పడం లేదని, కాగ్ నివేదికలోనే ఈ విషయం వెల్లడించందని తెలిపారు. సభకు జనాలు రాలేదని బీఆర్ఎస్ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారని, వారికి కామెర్లు వస్తే తామేమి చేస్తామని సెటైర్ వేశారు. జనాలు కనపడకపోతే ‘కంటివెలుగు’ అద్దాలు ధరించి చూడాలని హితవు పలికారు.
ఈ విలేకరుల సమావేశంలో కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, మువ్వా విజయ బాబు, తుళ్ళూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, డాక్టర్ రాజా రమేష్, ఎన్నారై ఝాన్సీ రెడ్డి,
జారె ఆది నారాయణ, కొండూరు సుధాకర్, వూకంటి గోపాల్ రావు, విజయ భాయి, సుతగాని జైపాల్, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి తదతరులు ఉన్నారు.