కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే రైతులకు పవర్ కట్ ఖాయం …మంత్రి పువ్వాడ..
-రేవంత్ రెడ్డి రైతు ద్రోహి …తస్మాత్ జాగ్రత్త
-రాత్రి కరెంటు ఇస్తే రైతులకు ఇబ్బందులే
-కాంగ్రెస్ ,బీజేపీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడుతున్నాయి
-కాంగ్రెస్ ,బీజేపీ వాళ్ళ మాయమాటలు నమ్మకండి
-రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ అందుకే రైతు బంధు , ఉచిత కరెంటు ఇస్తున్నారు ..
కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే ,రైతుల పవర్ కట్ ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు . రైతులకు ఉచిత కరెంటు పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ మాటలను నిరసిస్తూ బీఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గం రఘునాథ్ పాలెం మండలం మంచుకొండ గ్రామంలో మండల పార్టీ అద్వర్యంలో ధర్నా చేపట్టారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ దొంగ.. డౌన్ డౌన్ రేవంత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఉచితాలు వద్దంటూ రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటున్నాడు.. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3గంటల కరెంట్ వస్తుందని, మళ్ళీ పాతరోజులు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి.. అసలు ఏం తెలుసు నీకు రైతుల గురించి, వ్యవసాయం గురించి, కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే రైతులకు పవర్ కట్ అవుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రైతు ద్రోహి అలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే రైతులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు . కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలు నమ్మకండి వారు అధికారంలోకి వస్తే తెలంగాణ చీకటిమయం కావడం ఖాయం తస్మాత్ జాగ్రత్త అని అన్నారు .సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అందువల్లనే రైతు బంధు , ఉచిత కరెంటు ఇస్తున్నారని గుర్తు చేశారు. మూడవసారి కేసీఆర్ ను అధికారంలోకి తీసుకోని రావడం ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి సంక్షేమం దిశగా పయనిస్తుందన్నారు .
24 గంటలు విద్యుత్ ఇస్తే రైతులు తమకు అనుకూలమైన సమయంలో నీళ్ళు పెట్టుకుంటారు, సమయానికి అనుగుణంగా వ్యవసాయం చేస్తారని తెలిపారు. ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక పక్క బీజేపీ రైతుల మోటర్లుకు మీటర్లు పెట్టాలంటోంది, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది… ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని స్పష్టం గా అర్థమవుతుందన్నారు.
రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్ లు, పాము కాట్లతో రైతులు చనిపోయిన ఘటనలు అనేక ఉన్నాయని, నేను స్వయంగా చూశానని, పాము కాటు, తేలు కాటు కు గురై మమత ఆసుపత్రిలో చికిత్సలు పొందిన ఘటనలు చూశానని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి రుజువైందన్నారు .
కాంగ్రెస్ పార్టీ దళారుల కోసం, బీజేపీ పార్టీ ఆదాని, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారని, రైతులు మేల్కొని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తూ వస్తునే ఉందని, రైతుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు.