ఎంత మంచి చేసినా కృతజ్ఞత చూపించడం లేదు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినా కనికరం చూపించలేదని ఆవేదన!
- తనపై చెప్పులు వేసినా పట్టించుకోలేదని వ్యాఖ్య
- ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్ పైనా విమర్శలు
ప్రజలకు ఎంత మంచి చేసినా కృతజ్ఞత చూపించడం లేదని, ఇందుకు తనకు చాలా బాధగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మెండోరా ప్రాంత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ… శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినా కనికరం చూపించరా? అన్నారు. గతంలో కాకతీయ లీకేజీ నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళనలు చేశారని, హైదరాబాద్ కు తరలి వచ్చారన్నారు.
తనపై చెప్పులు వేసినా పట్టించుకోలేదని, ఎందుకంటే రైతులది బతుకు పోరాటమన్నారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు తొలుత అందేది మెండోరాకే అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నుండి నీరు తెస్తే కెనాల్ కమిటీ వారు కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకు మెండోరాకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత మంచి చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ పైన విమర్శలు
కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడని, కాంగ్రెస్ వాళ్లు మూడు గంటలు ఇస్తారట, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని వారు చూస్తున్నారని, అలాంటి వారిని తరిమి కొట్టాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మోర్తాడ్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతుందన్నారు. రైతులకు మిషన్ భగీరథ లాగే వ్యవసాయ పొలాలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షాలు రాకున్నా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కరువు కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లు ఇస్తూ రైతులకు అండగా నిలబడ్డారని, కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం రైతులకు హాని తలపెట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ వాళ్లు అన్యాయంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారన్నారు. రాత్రి పూట మూడు గంటల కరెంట్ ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్ళీ మనకు కావాలా? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలపై రైతులు ఆలోచన చేయాలని కోరారు. రైతులది అంతా ఒకే కులమని, పార్టీలతో రైతులకు సంబంధం లేదన్నారు.