టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: పవన్, చంద్రబాబులపై సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం…
- వైవీ సుబ్బారెడ్డిపై ప్రతిపక్ష నేతల ఆరోపణలు సరికాదన్న స్వామి
- టీటీడీ కార్యక్రమాలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజం
- శ్రీవాణి ట్రస్ట్ నిధులు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని చెప్పడం సరికాదన్న ఎంపీ
- హిందూ సెంటిమెంట్ తో చంద్రబాబు హిందువులకు వ్యతిరేకమని వ్యాఖ్య
టీటీడీపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆయన క్రైస్తవుడని గతంలో ప్రచారం చేశారని, అది అవాస్తవమని తేలిందని, ఆ తర్వాత క్రైస్తవ ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారన్నారు. ఇలా దుష్ప్రచారం చేసేవారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు.
టీటీడీ కార్యక్రమాలపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాలకు పరిమితం కావాలని సూచించారు. ఆయనకు ధార్మిక సంస్థలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఏపీలో మతమార్పిడులు జరగలేదన్నారు. శ్రీవాణి ట్రస్ట్ విషయంలోను చేసిన ఆరోపణలు సరికాదన్నారు. వైసీపీ నేతలు శ్రీవాణి ట్రస్ట్ నిధులను దోచుకుంటున్నారని చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు హిందూ సెంటిమెంట్‌తో హిందువులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
తాను టీటీడీకి న్యాయసహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకుంటానని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి భార్య కన్వర్టెడ్ క్రిస్టియన్ అని, తిరుపతి టెంపుల్ లో జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రపంచ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై ఇలాంటి తప్పుడు ప్రచారం తగదన్నారు. పవన్ కల్యాణ్ అబద్దాలు చెబుతున్నారని, చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమన్నారు.