- వ్యవసాయం గురించి మీకు ఎంత తెలుసో చెప్పాలన్న పొంగులేటి
- మీకు అధికారం, మంత్రి పదవి సోనియా పెట్టిన భిక్ష అని వ్యాఖ్య
- విద్యుత్ పై బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదన్న పొంగులేటి
తమ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కోఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని అనే ముందు వ్యవసాయం గురించి మీకు ఎంత తెలుసో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వైపు ఒక వేలు చూపిస్తే… మీవైపు నాలుగు వేళ్లు చూపుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
మీ ఫామ్ హౌస్ లో కాప్సికమ్ పంటతో కోట్లు సంపాదించామని చెపుతున్న మీరు… రాష్ట్ర రైతులకు ఆ ఫార్ములా ఏమిటో ఎందుకు చెప్పలేదని పొంగులేటి దుయ్యబట్టారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని… కేటీఆర్ ఏనాడైనా పాదయాత్ర చేశాడా? అని ప్రశ్నించారు. మీకు వచ్చిన అధికారం, మంత్రి పదవి సోనియాగాంధీ పెట్టిన భిక్ష అని చెప్పారు.
ఉచిత విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ ను ప్రజలను నమ్మడం లేదని పొంగులేటి అన్నారు. ఉచిత విద్యుత్ పై పేటెంట్ కాంగ్రెస్ కే ఉందని చెప్పారు. వైఎస్ హయాలో ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే నని తెలిపారు. తనకు ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించడంపై హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకునిపోతానని చెప్పారు.