- మధుమేహం, రక్తపోటు నియంత్రణకు మేలు
- గుండె జబ్బుల నివారణ
- జుట్టు నెరిసిపోయే సమస్యకు పరిష్కారం
- వ్యాధి నిరోధక శక్తి బలోపేతం
ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి..? కానీ, ఆరోగ్యం కావాలంటే తీసుకునే ఆహారం సరైనదిగా ఉండాలి. అన్ని పోషకాలు అందినప్పుడు వ్యాధులపై పోరాడే సామర్థ్యం మన శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ అన్నవి వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మరి విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభించే ఉసిరి (ఇండియన్ గూస్ బెర్రీ/ఆమ్ల)కి మనం ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలి. రోజూ ఒక చెంచాడు ఉసిరి పొడిని తీసుకుంటే చాలు ఆ రోజుకి కావాల్సినంత విటమిన్ సీ శరీరానికి అందుతుంది. ఆ తర్వాత జరిగే మార్పులు కచ్చితంగా కనిపిస్తాయి. ఉసిరికి ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఉదయం లేచిన తర్వాత గ్లాస్ వేడి నీటిలో (తాగేంత వేడి) ఒక చెంచాడు ఉసిరి పొడి వేసుకుని తాగాలన్నది వైద్యుల సూచన
ప్రయోజనాలు..
- వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. దీంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం ఉండదు. శరీరంలోని కణాలన్నింటినీ విటమిన్ సీ చురుగ్గా మారుస్తుంది. ముఖ్యంగా తరచూ జలుబు, అలర్జీలు కనిపించే వారికి ఉసిరి చాలా మంచిది.
- ఆమ్ల జీర్ణానికి కూడా మేలు చేస్తుంది. జీర్ణరసాల విడుదలకు సాయపడుతుంది. దీంతో తిన్నది మంచిగా జీర్ణం కావడంతోపాటు, మలబద్ధకం కూడా ఉండదు. ఆమ్లలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ ప్రాపర్టీలు జీర్ణాశయం, పేగుల్లోని ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గిస్తుంది.
- గుండెకు కూడా ఇది మంచి చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నిర్వీర్యం చేస్తాయి. గుండె జబ్బులకు కారణమయ్యే ఆక్సిడేటివ్ డ్యామేజ్ ను నిరోధిస్తుంది.
- ఇక చర్మం, శిరోజాల ఆరోగ్యాన్ని ఉసిరి బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ సీ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ కొల్లాజెన్ చర్మం, కేశ ఆరోగ్యానికి సాయపడుతుంది. జుట్టు నెరిసిపోవడాన్ని కూడా నివారిస్తుంది.
- ఉసిరి వల్ల మరో ప్రయోజనం బ్లడ్ షుగర్ ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. కార్బోహైడ్రేట్ల మెకానిజంను క్రమబద్ధీకరించే గుణం ఉసిరికి ఉంది. అందుకే రోజూ ఉసిరి తీసుకుంటే మధుమేహం పెరగకుండా ఉంటుంది.