తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు…కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో .చైర్మన్ పొంగులేటి

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు…కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో .చైర్మన్ పొంగులేటి

  • కూసుమంచి పర్యటనలో పరామర్శలు …విమర్శలు
  • పార్టీ మారని వారిపై అధికార మదంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపాటు ..
  • బీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజులు వచ్చాయి…ఫౌంహౌస్ కే కేసీఆర్ పరిమితం ఖాయం..
  • స్వలాభం కోసమే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధికార పార్టీలోకి చేరారని తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ముత్యాల గూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కందాల పోటీ చేసిన సమయంలో ఎవరైతే ఆయన గెలుపునకు కృషి చేశారో వారంతా ఆయనతో పాటు అధికార పార్టీలోకి చేరలేదనే కోపంతో వారికున్న అధికార మదాన్ని ప్రయోగించి వారిపై అక్రమ కేసులను పెట్టించి జైళ్లకు పంపించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజులు వచ్చాయని మరో మూడు నెలల్లో ప్రజల ఆశీస్సులు, దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గోడకు సున్నం కొట్టినంత సులువుగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న స్టంట్లు అన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. అంతకుముందు పొంగులేటికి చేగొమ్మ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మలీదు సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు. అదేవిధంగా ముత్యాలగూడెంలో మంకెన వాసును పరామర్శించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రామసహాయం నరేష్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, సుడిగాలి కిషన్ రావు, కన్నెటి వెంకన్న, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, బజ్జూరి వెంకట రెడ్డి, బొలికొండ శ్రీను, బొలికొండ రామకృష్ణ, పుల్లా రెడ్డి, సురేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నర్రా సీతారాములు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

కేసీఆర్ కు సీఎం హెూదా సోనియమ్మ బిక్ష…పొంగులేటి

కేసీఆర్ కు సీఎం హెదా కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ బిక్ష అని తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆమె పెట్టిన బిక్షతోనే నేడు ఆ సీట్లో కూర్చొని అధికార మదాన్ని ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన ఐ ఎన్ టీ యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ యూనియన్లో లేరనే నెపంతో తమ యూనియన్ ఆటో డ్రైవర్ల పై అధికార పార్టీ పెట్టే ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొనేందుకు కొత్తగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అధికార పార్టీ నేతల వేధింపులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అయ్యే ప్రతి ఖర్చు ఇక నుంచి పార్టీ తరుపున తానే భరిస్తానని తెలిపారు. అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రి తరుపున 50శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను ఇస్తున్నట్లు ప్రకటించి వెంటనే వాటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా యూనియన్ లతో సంబంధం లేకుండా ప్రతి ఆటో డ్రైవర్కు పార్టీ తరుపున ఇన్సూరెన్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. ఆటో డ్రైవర్ సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆటో డ్రైవర్ సోదరులకు ఖాకీ చొక్కాలను పంపిణీ చేయడంతో పాటు బీఆర్ఎస్ కెవీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామ చేసిన సత్తార్ మియాను, మరికొంత మంది బీఆర్ఎస్, ఇతర పార్టీల ఆటో యూనియన్ నాయకులను, ఆటో డ్రైవర్లను ఐ ఎన్ టీ యూ సీ కండువా కప్పి ఆహ్వానించారు.

  • రాబోవు ఎన్నికల్లో ఫామ్ హౌస్ కే కల్వకుంట్ల కుటుంబం పరిమితం
    సమావేశ ప్రారంభానికి ముందు ప్రజా గాయకుడు గద్దర్ కు రెండు నిమిషాల పాటు నివాళ్లర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో ఫామ్ హౌస్ కే కల్వకుంట్ల కుటుంబం పరిమితం అవ్వడం ఖాయమన్నారు. ఎన్నికలకు ముందే కేసీఆర్ కు ఆర్టీసీ ఉద్యోగులు, రైతులు గుర్తుకొచ్చారా అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నా వాటన్నింటిని పక్కన పెట్టి ఈ రెండిటిపైనే దృష్టిసారించడం విడ్డూరమన్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటన చేసి తొమ్మిదేళ్లు దాటిందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో వారిని దూషించిన ముఖ్యమంత్రి నేడు వారిపై కపట ప్రేమ చూపించడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇలా ఎన్నో హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ విషయాన్ని కేసీఆర్ గ్రహించి ఎన్నికల స్టంట్ లను ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రెండు లక్షల రూపాయాల రుణమాఫీతో పాటు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుందన్నారు. ఐ ఎన్ టీ యూ సీ జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోరం కనకయ్య, ఖమ్మం డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, పార్టీ రాష్ట్ర నాయకురాలు బేబి స్వర్ణకుమారి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలినేని నరేంద్ర, దొడ్డా నగేష్ యాదవ్, మలీదు జగన్, ఎం.డీ. ముస్తఫా, పల్లెబోయిన చంద్రయ్య, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, దుంపల రవికుమార్, మియాభాయ్, ఇమామ్ భాయ్, కొంగర జ్యోతిర్మయి, బోడా శ్రావణ్ కుమార్, కొప్పెర ఉపేందర్, ఐ ఎన్ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు, సిహెచ్. విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థునులకు గుడ్ న్యూస్ …త్వరలో ప్రభుత్వం స్కూటీలు పంపిణి ..

Ram Narayana

పంజాబ్ ప్రభుత్వం బాగా పని చేసింది.. అక్కడ ఖలిస్థానీ ప్రభావం లేదు: అమిత్ షా…

Drukpadam

వైయస్సార్టీపీలో కమిటీలన్నీ రద్దు.. షర్మిల సంచలన నిర్ణయం!

Drukpadam