Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు

పోలవరం పై జగన్ రెడ్డి చేతులెత్తేశాడు …చంద్రబాబు

  • ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ 
  • పోలవరంపై జగన్ చేతులెత్తేశాడన్న టీడీపీ అధినేత
  • ప్రాజెక్టును నాశనం చేశాడని విమర్శలు

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాజమండ్రిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం నిర్మాణంపై జగన్ చేతులెత్తేశాడని, ఒక మూర్ఖుడు అధికారంలో ఉంటే ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి పోలవరమే పెద్ద కేస్ స్టడీ అని వివరించారు. 

జగన్ రెడ్డి చేతులెత్తేశాడు
నిన్న కూడా జగన్ రెడ్డి నోటి వెంట అదే మాట… 41.15 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్ట్ నిర్మాణమంటున్నాడు. ప్రాజెక్ట్ నిర్మించలేనని చేతులెత్తేశాడు. కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నాడు. కేంద్రం చేయదని ఎవరు చెప్పారు…? ప్రాజెక్ట్ ని చెడగొట్టవద్దని అటు కేంద్రం, ఇటు మేం మొత్తుకున్నాం. ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుంది… మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమే. 

ప్రధానమంత్రికి చెప్పాను… ఆయన్నే బటన్ నొక్కమన్నాను అని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అంటున్నాడు. మరి ఆనాడు కేంద్రం వద్దని చెప్పినా వినకుండా వితండవాదం చేసి మూర్ఖత్వంతో ఎందుకు పనులు రద్దు చేశాడు? రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి కాంట్రాక్ట్ సంస్థల్ని ఎందుకు మార్చాడు. దానికి సమాధానం చెప్పడు? 

ఇతను చేసిన పిచ్చిపనులకు కాఫర్ డ్యామ్, డయా ఫ్రమ్ వాల్ మొత్తం పోయాయి. చేయాల్సిన నాశనం చేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదీ ఇతని పద్ధతి. 2020 జూన్ నాటికి పూర్తికావాల్సిన ప్రాజెక్ట్ ని 2025కి పూర్తి చేస్తానని కబుర్లు చెబుతున్నాడు. ఈయన మళ్లీ వచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేసి… ఇదంతా జరిగేదేనా? 

ఇలాంటి వాడిని మేధావుల ముసుగులో ఉన్న కొందరు సిగ్గులేకుండా ఇంకా సమర్థిస్తున్నారు. వాళ్లకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకంటే సొంత ప్రయోజనాలే ముఖ్యం. పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించాక అక్కడి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. ఒక మంచి ప్రాజెక్ట్ ను ఒక దుర్మార్గుడు ఏవిధంగా నిర్వీర్యం చేశాడో కళ్లముందు కనిపించింది. 

మా హయాంలో పట్టిసీమ నిర్వాసితులకు ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తే, పోలవరం నిర్వాసితులకు కూడా అంత మొత్తం ఇస్తానని నమ్మించాడు. సకల వసతులతో నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాక వారి ముఖం కూడా చూడలేదు. అడిగితే ఏవేవో చెప్పి తప్పించుకుంటాడు.                                                                          

ప్రజెంటేషన్ వివరాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు

పురుషోత్తమ పట్నం లిఫ్ట్ ఇరిగేషన్

ఇది పూర్తయ్యేలోపు అటు కృష్ణాడెల్టాకు నీరు అందించడానికి పట్టిసీమ నిర్మించాం. ఇటువైపు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆయకట్టు 1,35,000 ఎకరాలు. 

అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం ప్రాంతాల్లో 67,614 ఎకరాల స్థిరీకరణకు అవకాశముంది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం, రూ.1,835 కోట్లు అయితే, రూ.1,578 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.13 కోట్లు ఖర్చు పెట్టింది. 

ఏలేరు డెల్టా ఆధునికీకరణ

మొత్తం ఆయకట్టు 53,017 ఎకరాలు, మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.295.83 కోట్లు. టీడీపీ హయాంలో రూ.46 కోట్లు ఖర్చుపెట్టాం. ఈ ప్రభుత్వంలో కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 

గోదావరి డెల్టా ఆధునికీకరణ

మొత్తం ఆయకట్టు 10.13 లక్షల ఎకరాలు. తూర్పుగోదావరిలో 4.79లక్షల ఎకరాలు. చివరి భూములకు నీరివ్వడానికే ప్రాధాన్యత ఇచ్చాం. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.3,361కోట్లు. 

టీడీపీ హయాంలో రూ.813 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ వచ్చాక రూ.123 కోట్లు ఖర్చు పెట్టింది. నాలుగేళ్లలో 5 శాతం పనులు పూర్తి చేయలేక మొత్తం ప్రాజెక్ట్ ని గాలికి వదిలేశారు.    
గోదావరి ఫ్లడ్ బ్యాంక్స్

మొత్తం ప్రాజెక్ట్ అంచనా రూ.851.94 కోట్లు. టీడీపీ హయాంలో రూ.236 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.7 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. గోదావరి ఫ్లడ్ బ్యాంకుల పటిష్టానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవి పటిష్టం చేయకపోతే, మొత్తం తూర్పుగోదావరి జిల్లాకే ప్రమాదం. 

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో రూ.కోటి వ్యయంతో గేట్లు పెట్టలేకపోయారు వీళ్లు. అలాంటి ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా? అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 70మంది వరకు చనిపోతే, వీళ్లు ఏమీ పట్టించుకోలేదు.         

తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం

మొత్తం ఆయకట్టు 1.85 లక్షల ఎకరాలు. ఈ ప్రాజెక్ట్ తో సాగునీటితో పాటు, 18 మండలాలకు తాగునీరు అందుతుంది. మొత్తం అంచనా వ్యయం రూ.674.52 కోట్లు. 

2003లో టీడీపీ ప్రభుత్వమే శంకుస్థాపన చేసింది. మరలా టీడీపీ హయాంలో 2018లో ప్రారంభించి, రూ.144 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ వచ్చాక రూ.54 కోట్లు ఖర్చు పెట్టింది. అదికూడా కేవలం మెయింటెనెన్స్ కోసమే.

ముసురుమిల్లి రిజర్వాయర్

మొత్తం ఆయకట్టు 22,316 ఎకరాలు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.207 కోట్లు.  ఈ రిజర్వాయర్ ద్వారా 22,316 ఎకరాలకు సాగునీరు అందితే, అందులో 10,543 ఎకరాలు అచ్చంగా గిరిజన భూములే. 23 గ్రామాలకు తాగునీరు అందుతుంది.

 టీడీపీ హయాంలో రూ.6 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.27లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. చివరకు రిజర్వాయర్ మెయింటెనెన్స్ కూడా నిలిపేశారు.                                                                                                                                        
వెంకటనగరం లిఫ్ట్

మొత్తం ఆయకట్టు 34 వేల ఎకరాలు. 3 లిఫ్టులతో గోదావరి నీటితో ప్రస్తుతం ఉన్న పంపింగ్ స్కీమ్ పునరుద్ధరించవచ్చు. దాంతో 4,250 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. 29,750 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. మొత్తం అంచనా వ్యయం రూ.124.18 కోట్లు. 

టీడీపీ హయాంలో రూ.11.91కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్లు వచ్చాక రూపాయి ఖర్చు పెట్టలేదు.

భూపతిపాలెం రిజర్వాయర్

మొత్తం ఆయకట్టు 11,526 ఎకరాలు, ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.187.91 కోట్లు. టీడీపీ హయాంలో రూ.7.60 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 1 కోటి 24 లక్షలు ఖర్చు పెట్టింది. ప్రస్తుతం మెయింటెనెన్స్ కూడా జరగడం లేదు. 

ఈ రిజర్వాయర్ ద్వారా రంపచోడవరం, గంగవరం మండలాల్లోని 32 గ్రామాల్లోని 11,526 ఎకరాల గిరిజన ఆయకట్టుకు నీరు అందుతుంది. గిరిజన గ్రామాలకు తాగునీరు అందించవచ్చు.

చాగల్నాడు ఎత్తిపోతల పథకం

మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.70 కోట్లు. 1997లో తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేశాం. 2003లో నిర్మాణ పనులు ప్రారంభించాం. 2.85 టీఎంసీల నీటితో 22 వేల ఎకరాలకు నీళ్లు అందించవచ్చు. దాంతో 35 గ్రామాలకు లబ్ది కలుగుతుంది. 

అప్పట్లో ప్రాజెక్ట్ పూర్తయినా, 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూ.17 కోట్లు ఖర్చు పెట్టి చిన్న చిన్న పనులు పూర్తి చేశాం. వైసీపీ వచ్చాక ప్రాజెక్ట్  నిర్వహణనే పట్టించుకోకుండా వదిలేసింది.

చిత్తూరులో మంత్రికి మాత్రం రూ.8 వేల కోట్ల టెండర్లు కట్టబెట్టారు

చిన్న ప్రాజెక్టులు అయినా నిర్వహణ సక్రమంగా ఉండాలి. తూర్పుగోదావరి జిల్లాలో చిన్నచిన్న ప్రాజెక్టుల నిర్వహణకు రూ.10 కోట్లు, రూ.20 కోట్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వద్ద డబ్బులేదు. అదే చిత్తూరు జిల్లాలో అవసరం లేకపోయినా అక్కడి మంత్రికి రూ.8 వేల కోట్ల టెండర్లు కట్టబెట్టారు. రైతుల్ని బెదిరించి వాళ్లకు పరిహారం ఇవ్వకుండా వాళ్ల భూముల్లో పైపులు వేశారు. 

అవులపల్లి రిజర్వాయర్ పేరుతో ఇష్టమొచ్చినట్టు నిర్మాణం చేస్తే, దానిపై ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా వేసింది. దానిపై మేం ప్రశ్నిస్తే, దాడులకు తెగబడ్డారు. 172 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే అరాచకాలు చేస్తారా? మీరు ఎంతతెగిస్తే, మేంఅంత రెట్టించి పోరాడతామని తెలుసుకోండి.

Related posts

ఖమ్మం టీఆర్ యస్ వర్గపోరుపై కేటీఆర్ సున్నితమైన హెచ్చరికతో క్లాస్

Drukpadam

సెలవుపై వెళ్లిపోయిన తాడిపత్రి రిటర్నింగ్ అధికారి

Ram Narayana

పొంగులేటి ఇంటికి ఈటెల వెళ్లిన విషయం నాకు తెలియదు …అయినా తప్పేమికాదు …బండి సంజయ్!

Drukpadam

Leave a Comment