- ‘నీట్’ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు నిరాహారదీక్ష
- ఈ పోరాటం రాజకీయం కాదన్న సీఎం స్టాలిన్
- సామాజిక సమానత్వ విద్య కోరుకునే తమిళనాడు ప్రజల డిమాండ్ అన్న సీఎం
రాష్ట్రంలో ‘నీట్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే యువజన విభాగం నిన్న రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేపట్టింది. ఈ ఒక్క రోజు దీక్షను మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఈ దీక్షలను ఉద్దేశించి ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. నీట్ రద్దు కోసం డీఎంకే చేస్తున్న పోరాటం రాజకీయ అభ్యర్థన కాదని, సామాజిక సమానత్వ విద్య కోరుకునే తమిళనాడు ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. నిరాహారదీక్షలను విజయవంతం చేసిన వారికి సీఎం అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గెలిచి అధికారం చేపడితే రాష్ట్రంలో ‘నీట్’ ఉండదని స్పష్టం చేశారు.
సాయంత్రం దీక్షల విరమణ అనంతరం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్న నీట్‌ను రద్దు చేయాలని, లేదంటే తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు ధర్నా చేద్దామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామికి ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, నీట్-యూజీ పరీక్షకు మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత అత్యధిక దరఖాస్తులు వస్తున్నది తమిళనాడు నుంచే కావడం గమనార్హం.