ఆశ్చర్యమేముంది..?: వాగ్నర్ చీఫ్ మృతిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు
- రష్యా అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి రాజీపడ్డ కొన్ని నెలలకే ఘటన
- విమానం కూలడంతో వ్యాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్, సంస్థ సహవ్యవస్థాపకుడు మృతి
- మిసైల్ దాడి జరగడంతో విమానం కూలిపోయినట్టు రష్యా మీడియా వర్గాల్లో చర్చ
- రష్యా వెన్నుపోటుదారుల చేతిలో ప్రిగోజిన్ మరణించినట్టు వ్యాగ్నర్ గ్రూప్ ప్రకటన
ఉక్రెయిన్‌తో యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్న రష్యా కిరాయి సైన్యం వ్యాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జినీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. రష్యా అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి ఆపై రాజీపడ్డ కొన్ని నెలలకే ప్రిగోజిన్ మరణించడం గమనార్హం. బుధవారం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన విమానం ట్వెర్ ప్రాంతంలోని కుజెంకినో ప్రాంతంలో కూలిపోయినట్టు రష్యా అత్యవసర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రష్యా విమానయాన శాఖ రాస్‌ఏవియేట్సియా ప్రకటన ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 10 మంది ఉన్నారు. వారందరి పేర్లను రాస్ ఏవియేట్సియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో వ్యాగ్నర్ గ్రూప్ సహవ్యవస్థాపకుడు, ప్రిగోజిన్‌కు సన్నిహితుడైన డిమిట్రీ యూట్కిన్ కూడా మరణించారు. ఈ ప్రమాదంపై రష్యా దర్యాప్తు ప్రారంభించింది.
విమానంపై మిసైళ్ల దాడి జరగడంతో అది కూలిపోయి ఉంటుందని రష్యా మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ప్రిగోజిన్ మరణానికి సంతాప సూచకంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వ్యాగ్నర్ గ్రూప్ కార్యాలయంపై శిలువ ఆకారంలో ఉన్న గుర్తును ప్రదర్శించారు. కాగా, వ్యాగ్నర్ గ్రూపునకు చెందిన ఓ టెలిగ్రామ్ ఛానల్ ప్రిగోజిన్ మరణాన్ని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రిగోజిన్ ఓ హీరో అని కొనియాడిన వ్యాగ్నర్ గ్రూప్..రష్యా వెన్నుపోటు దారుల చేతిలో ఆయన మరణించినట్టు పేర్కొంది.
రష్యా అధ్యక్షుడిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసి కలకలం రేపిన ప్రిగోజిన్ మరణంతో వ్యాగ్నర్ గ్రూప్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

- ప్రిగోజిన్ మరణం ఊహించిందేనన్న బైడెన్
- రష్యాలోని ప్రముఖులకు ఇదొక హెచ్చరిక.. ఉక్రెయిన్
- విశ్వాసంగా లేకుంటే మరణం తప్పదని చెప్పడమే పుతిన్ ఉద్దేశమని వ్యాఖ్య
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఇటీవల తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ బుధవారం చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం కుప్పకూలిపోవడంతో అనుచరులతో సహా కన్నుమూశారు. అయితే, ఈ విషయం తమనేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ గా వ్యవహరించిన ప్రిగోజిన్ మరణం అంతా ఊహించిందేనని తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్ కూడా ఈ ప్రమాదంపై స్పందించింది. వాగ్నర్ చీఫ్ మరణం రష్యాలోని ప్రముఖులకు ఓ హెచ్చరికలాంటిదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సహాయకుడు మిఖైలో పొడొలియాక్ చెప్పారు. ఈ ఘటన ద్వారా తనకు విశ్వాసంగా ఉండకపోతే మరణం తప్పదని పుతిన్ వారికి హెచ్చరికలు పంపించినట్లు అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ పై యుద్ధంలో వాగ్నర్ గ్రూపు కూడా పాల్గొంది. ప్రిగోజిన్ స్వయంగా తన దళాలను ముందుండి నడిపించారు. ఈ దళాల వల్లే ఉక్రెయిన్ కు ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, తమకు సరిపడా ఆయుధాలు ఇవ్వట్లేదని, రష్యా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వాగ్నర్ సైనికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రిగోజిన్ ఈ ఏడాది జూన్ లో ఆరోపించారు. అదే నెల 23 వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించి, తన సైనికులను మాస్కో వైపు నడిపించాడు. ఆ మరుసటి రోజే తన నిర్ణయాన్ని ప్రిగోజిన్ ఉపసంహరించుకున్నాడు.
ఈ సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో కల్పించుకుని పుతిన్, ప్రిగోజిన్ మధ్య సంధి కుదిర్చారు. దీంతో అంతా సర్దుకున్నట్లే కనిపించింది. ప్రిగోజిన్ ను మాస్కోకు ఆహ్వానించి పుతిన్ విందు కూడా ఇచ్చారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడంతో అమెరికా, ఉక్రెయిన్ సహా పలు దేశాలు పుతిన్ పైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
కాస్త ఆలస్యమైంది.. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతిపై ఎలాన్ మస్క్!
- ఊహించినదానికన్నా కాస్త ఆలస్యమైందన్న మస్క్
- ప్రిగోజిన్ విమాన ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండొచ్చని వ్యాఖ్య
- ట్విట్టర్ లో స్పందించిన ఎలాన్ మస్క్

రష్యాలో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా మారడమే ప్రిగోజిన్ మరణానికి కారణమైందని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే సందేహం వ్యక్తం చేశారు. తాజాగా స్పేస్ ఎక్స్ అధినేత, ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ కూడా ప్రిగోజిన్ మరణంపై స్పందించారు.
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండానే ఆయన మరణాన్ని తాను ముందే ఊహించాననీ, అయితే కొంత ఆలస్యం జరిగిందంటూ ట్వీట్ చేశారు. పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత ప్రిగోజిన్ కు మరణం తప్పదని ఊహించినట్లు మస్క్ తెలిపారు. విమాన ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగేందుకు స్వల్ప అవకాశాలు లేకపోలేదని తన ట్వీట్ లో మస్క్ పేర్కొన్నారు.