Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

జీతం విషయంలో అవమానానికి గురైన హోమ్ గార్డ్ రవీందర్ కన్నుమూత …!

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలిన రవీందర్
  • ఉన్నతాధికారులు అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం
  • పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో 70 శాతం కాలిన శరీరం
  • డీఆర్డీవో ఆసుపత్రి ముందు ఉద్రిక్తత.. పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న హోంగార్డులు
  • తన భర్తది ఆత్మహత్య కాదని ఉన్నతాధికారులు చేసిన హత్య అని ఆరోపణ
  • ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులను అరెస్టు చేయాలని డిమాండ్
  • తన పిల్లలకు న్యాయం చేయాలని కుటుంబంతో కలిసి ఆసుపత్రి ముందు బైఠాయింపు
  • హోంగార్డులకు ఉన్నతాధికారుల హెచ్చరికలు

ఉన్నతాధికారులు అవమానించారని ఆత్మహత్యాయత్నం చేసిన హైదరాబాదులోని హోంగార్డు రవీందర్ కన్నుమూశాడు. డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస వదిలాడు. ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. రవీందర్ మృతితో ఆసుపత్రి ముందు ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న హోంగార్డులు పెద్ద సంఖ్యలో డీఆర్డీవో ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు …

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో ఆసుపత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రవీందర్ ఉప్పుగూడలో భార్యా పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఆయన భార్య సంధ్య, ఇద్దరు కుమారులు మనీశ్, కౌశిక్ ఉన్నారు.

తనకు రావాల్సిన జీతం కోసం హెడ్డాఫీసుకు వెళ్లగా అక్కడ ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందుతో పాటు మరో ఇద్దరు అవమానించారని రవీందర్ మరణ వాంగ్మూలంలో చెప్పారు. తనకు జరిగిన అన్యాయం ఇతర హోంగార్డులకు జరగకుండా చూడాలని రవీందర్ వేడుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించడంతో తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని రవీందర్ నిప్పంటించుకున్నారు.

వెంటనే మంటలు ఆర్పిన పోలీసులు.. రవీందర్ ను తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కంచన్ బాగ్ లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తీసుకెళ్లారు. రవీందర్ శరీరం 70 శాతం కాలిపోయిందని వెల్లడించిన వైద్యులు.. ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చి చికిత్స అందించారు. అయితే, మూడు రోజుల తర్వాత చికిత్స పొందుతూనే రవీందర్ కన్నుమూశారు.

ఉస్మానియా ఆసుపత్రి ముందు హోంగార్డు భార్య ఆందోళన

Homeguard Ravinder wife Sandhya Protest at Usmania Hospital

ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చేరిన హోంగార్డు రవీందర్ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న హోంగార్డు రవీందర్ భార్య సంధ్య.. తన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు బైఠాయించారు. 

తన భర్తది ఆత్మహత్య కాదని, ఉన్నతాధికారులు చేసిన హత్య అని ఆరోపించారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు. పదిహేడేళ్లుగా నిబద్ధతతో పనిచేసిన తన భర్తను వేధించి, ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ రోదించారు. తన భర్త ఫోన్ ను తీసుకున్న పోలీసులు దానిని అన్ లాక్ చేసి, అందులోని డాటా మొత్తాన్నీ తొలగించారని సంధ్య ఆరోపించారు. ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హోంగార్డులకు ఉన్నతాధికారుల వార్నింగ్
హోంగార్డు రవీందర్ చనిపోవడంతో ఆయన కుటుంబానికి మద్దతుగా హోంగార్డులు ఎవరూ వెళ్లకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. హోంగార్డులు అందరూ తమ తమ విధుల్లోనే ఉండాలని, విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈమేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల బాధ్యతలను ఎస్సైలకు అప్పగించారు. హోంగార్డులు అందరూ విధులకు హాజరయ్యేలా, విధులు కేటాయించని వారంతా పోలీస్ స్టేషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హోంగార్డు రవీందర్ మృతిపై ప్రతిపక్ష నేతల స్పందన

Opposition Leaders Reaction On Homeguard Ravinder death

జీతం సమయానికి ఇవ్వడంలేదని ప్రశ్నించినందుకు ఉన్నతాధికారులు దూషించడంతో ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. రవీందర్ మృతిపై ఆయన కుటుంబంతో పాటు హోంగార్డులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో హోంగార్డుల అందరి పరిస్థితి దయనీయంగానే ఉందని వాపోతున్నారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, హోంగార్డు ఆత్మహత్యపై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎవరెవరు ఏమన్నారంటే..

బాధాకరం.. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
హోంగార్డు రవీందర్ చనిపోవడం బాధాకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రవీందర్ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. హోంగార్డు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

హోంగార్డుల పరిస్థితి అధ్వానం: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి అధ్వానంగా మారిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హోంగార్డు రవీందర్ మరణం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రవీందర్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని, హోంగార్డుల డిమాండ్లను నెరవేర్చాలని అందులో డిమాండ్ చేశారు.

ఆ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలి: బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
రవీందర్ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరమని అన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

రవీందర్ ది ప్రభుత్వ హత్యే: కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన హోంగార్డు రవీందర్ ను ప్రభుత్వమే హత్య చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని, హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Related posts

కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం సన్నగిల్లుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..!

Ram Narayana

రేవంత్ అంకుల్.. మా ఇల్లు కూల్చేయద్దు ప్లీజ్..

Ram Narayana

రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ.. వీడియో ఇదిగో!

Ram Narayana

Leave a Comment