Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్కోర్ట్ తీర్పులు

చంద్రబాబుకు భారీ ఊరట.. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు

  • ఇప్పటికే ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు
  • లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు
  • రెండు షూరిటీ బాండ్లు ఇవ్వాలని ఆదేశాలు

అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పై నిన్న ఇరువైపు వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఈరోజు తీర్పును వెలువరించింది. లక్ష రూపాయల పూచీకత్తును డిపాజిట్ చేయాలని… ఇద్దరు రెండు షూరిటీ బాండ్లను సమర్పించాలని ఆదేశించింది. గతంలో ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి గమనార్హం. 

నిన్నటి విచారణలో చంద్రబాబు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అంగళ్లులో అధికార పార్టీకి చెందినవారే చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు రువ్వారని కోర్టుకు పోసాని తెలిపారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా నిలిచారని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పించారు. వైసీపీ వాళ్లే రాళ్ల దాడి చేసి, మళ్లీ వాళ్లే తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చాలా మందికి ఇప్పటికే బెయిల్ లభించిందని… సుప్రీంకోర్టు సైతం వీరికి బెయిల్ ఇవ్వడాన్ని సమర్థించిందని చెప్పారు. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. 

మరోవైపు పోలీసుల తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని ఆయన కోర్టుకు తెలిపారు. పిటిషనర్ (చంద్రబాబు) చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని చెప్పారు. దాడుల్లో పోలీసులకు గాయాలయ్యాయని, రాజకీయ కక్షలో భాగంగా కేసు పెట్టారనడంలో నిజం లేదని అన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేయాలని కోర్టును కోరారు. ఇరువైపు వాదనలను విన్న హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. ఆయనపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో దాదాపు అందరికీ బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడంతో… టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

సీయం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు ..

Drukpadam

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు మృతి!

Drukpadam

పోలీసులు అధికార పార్టీలకు కొమ్ముకాయడంపై సుప్రీం చురకలు !

Drukpadam

Leave a Comment