ఖమ్మంలో రౌడీ రాజ్ ..మంత్రి మనుషుల దౌర్జన్యాలు …మాజీమంత్రి ఫైర్…
సీపీ నుంచి డీజీపీ వరకు ఫోన్లు చేశాను… ఫలితం శూన్యమన్న తుమ్మల
మల్సూర్ కూతురు ఎంగేజ్ మెంట్ లో పువ్వాడ మనుషులు బెదిరింపులకు పాల్పడ్డారన్న తుమ్మల
కాంగ్రెస్ కార్యకర్తలను పనికట్టుకుని వేధిస్తున్నారని మండిపాటు
ప్రజలను కాపాడే బాధ్యత తనదే అని వ్యాఖ్యనించారు
అధికార బీఆర్ఎస్ పార్టీ, పోలీసు అధికారుల తీరుపై తుమ్మల నాగేశ్వరావు విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో రౌడీ రాజ్యం నడుస్తుందని ,మంత్రి మనుషుల దౌర్జన్యాలు , బెదిరింపులు నిత్యకృత్యం అయ్యాయని దీనిపై పోలీస్ అధికారులు తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు . బీఆర్ఎస్ నేతలు ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారని అన్నారు. నిన్న మల్సూర్ అనే కాంగ్రెస్ కార్యకర్త కూతురు ఎంగేజ్ మెంట్ లో మంత్రి పువ్వాడ అజయ్ మనుషులు 20 మంది బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పనికట్టుకుని తమ కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు. కొందరు పోలీసు అధికారులు సైతం తమ కార్యకర్తలను వేధిస్తున్నారని… కంట్రోల్ చేయండని… లేకపోతే ప్రజలు మీమీద తిరుగుబాటు చేస్తారని సీపీ, డీజీపీకి ఫోన్ చేసి చెప్పానని… అయినా ఫలితం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఎప్పటికీ కాంగ్రెస్ జిల్లానే అని చెప్పారు. ప్రజలను కాపాడే బాధ్యత తనదని… ప్రజలు గెలిచే ఎన్నిక ఇది అని అన్నారు. ఎంత పోరాటం చేసినా బీఆర్ఎస్ నేతల గుట్టల కబ్జాలు, ప్లాట్ల అమ్మకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని లేకపోతె తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు …
నెలరోజుల తర్వాత అధికారంలో ఉండని వారి కోసం అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను ప్రయివేటు సైన్యంగా మార్చారని మండిపడ్డారు. గురువారం ఖమ్మంలో నిర్వహించిన ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకం ఎన్నడూ చూడలేదన్నారు. పోలీసులను తమ ప్రయివేటు సైన్యంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
బెదిరింపులు, దౌర్జన్యంతో కాంగ్రెస్ నేతలను భయపెడుతున్నారన్నారు. ఖమ్మంలో అరాచక పాలనను తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాలన్నారు. భారత్ జోడో యాత్రతో యావత్ దేశాన్ని ఐక్యంచేసిన రాహుల్ గాంధీ ఆహ్వానంతో తాను కాంగ్రెస్‌లో చేరానన్నారు. నియంతృత్వ రాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లిందన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు పరిధి దాటి తమ పార్టీ వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు.
మరో నెల రోజుల తర్వాత అధికారంలో ఉండని వారి కోసం అధికారులు, పోలీసులు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. పోలీస్ అధికారులు తమ పధ్ధతి మార్చుకోకపోతే ప్రజా తిరుగుబాటు చూస్తారని హెచ్చరించారు. అహంకార పాలనకు పాతరేసి ఖమ్మం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ని గెలిపించాలని ప్రజలను తుమ్మల కోరారు.