Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సాగర్ లో నీరు పుష్కలం రెండు పంటలకు డోకా లేదు …మంత్రి పొంగులేటి

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో రెండు పంటలు పండించుకోవడానికి, రెండు కాల్వలకు పుష్కలంగా, కావాల్సిన నీరు ఉన్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి కూసుమంచి మండలం పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండో జోన్ కు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రింద 2.75 లక్షల ఆయకట్టు, 37 మండలాల పరిధిలో ఉందన్నారు. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు వుందని ఆయన తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత నీటిని దూరదృష్టితో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆయన అన్నారు. భవిష్యత్తులో కృష్ణ బేసిన్ లో నీటికి సమస్యలు వస్తే, సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని సాగుకు ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు. రూ. 80 కోట్ల వ్యయంతో ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టినట్లు, ఆగస్టు 15 కల్లా పనులు పూర్తి చేసుకొని, నీటిని విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వర్షాలు పడక శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు నీరు రాకపోతే, ప్రత్యామ్నాయంగా ఏన్కూరు లింక్ కెనాల్ తో గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. దీనితో సుమారు 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, వందలాది మైనర్ ఇర్రిగేషన్ వనరులు, లంకాసాగర్ లకు నీరు అందుతుందని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దీన్ని చేపట్టినట్లు ఆయన అన్నారు. ఈనెల 15 న ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించుకోబోతున్నామన్నారు.
దేవుళ్ళు దీవించబట్టే ఇందిరమ్మ రాజ్యంలో రెండు పంటలకు సరిపడా నీరు వచ్చిందని మంత్రి తెలిపారు. రైతును రాజు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని, రైతు భరోసా అందించబోతున్నామని ఆయన అన్నారు. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర అందిస్తున్నట్లు, పంటలకు ఇన్సూరెన్స్ ప్రభుత్వంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు, సన్న వడ్లకు రూ. 500 ల బోనస్ అందించనున్నట్లు ఆయన అన్నారు.
అనంతరం మంత్రి పాలేరు మినీ హైడల్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రం పనిచేయకపోవడంపై కారణాలు అడిగారు. నీరు విడుదల అయ్యే సందర్భంలోగా కేంద్రంలో మరమ్మత్తులు ఉంటే పూర్తిచేసుకొని, ఉత్పత్తికి సిద్ధంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మినీ హైడల్ కేంద్రానికి సంబంధించి వివరాలతో సమగ్ర నివేదిక వెంటనే సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, ఇఇ వెంకటేశ్వర రావు, హైడల్ స్టేషన్ ఏడిఇ పద్మజ, ఏఇ అఖిల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమాజ అభివృద్ధికి జర్నలిస్టుల కృషి ఎనలేనిది..ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1

Ram Narayana

మణుగూరులో స్వల్ప భూప్రకంపనలు

Ram Narayana

Leave a Comment