- తెలంగాణ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్‌ను చీల్చే కుట్ర చేసిందన్న కేసీఆర్
- కాంగ్రెస్ వెనుకబడిన ప్రాంతం అన్న తెలంగాణ ఇప్పుడు సస్యశ్యాలమైందన్న కేసీఆర్
- తెలంగాణను సర్వనాశనం చేసి ఇప్పుడు సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట తప్పిందని, పైగా 2004లో పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు. ఐదారు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది… ఆ తర్వాత తెలంగాణ ఇస్తానని మాట తప్పింది… కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. మహబూబ్ నగర్‌లో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిచేవన్నారు. ఇప్పుడు వచ్చిన మార్పును అందరు చూడాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పాలించిన 50 ఏళ్లు తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోకుండా వదిలేసిందని, పైగా వెనుకబడిన ప్రాంతమని, గరీబు ప్రాంతమని పేర్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వెనుకబడిన ప్రాంతం అన్న తెలంగాణ ఇప్పుడు సస్యశ్యామలం అయిందన్నారు. ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందన్నారు. ఇందిరమ్మ కాలంలో కాంగ్రెస్ మన తెలంగాణకు వెనుకబడిన ప్రాంతమని పేరు పెట్టిందన్నారు. ఇక్కడ నీళ్లు లేవని… వడ్లు పండవని సమైక్య రాష్ట్రంలో మాట్లాడారని, కానీ ఇప్పుడు దేశంలోనే అత్యధిక వరి దిగుబడి రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా వరితో నిండి ఉంటున్నాయన్నారు. అందుకే ఆరు దశాబ్దాలు ఎంతగా మోసపోయామో అర్థం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ హయాంలో పక్కనే కృష్ణా నది ఉన్నప్పటికీ కొల్లాపూర్‌కు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్సే అన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కంటే ముందు ఉన్న ముఖ్యమంత్రులు నీళ్లు ఇవ్వలేదు… రూ.2వేల పెన్షన్ ఇవ్వలేదన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అన్నారు. మొన్న ఇందిరమ్మ వారసుడు రాహుల్ గాంధీ ఇదే కొల్లాపూర్‌కు వచ్చాడని, ఎందుకు వచ్చాడో ఆలోచించాలన్నారు. తెలంగాణను ఆగం పట్టించి… ముళ్లకిరీటం పెట్టేందుకు వచ్చాడా? గడ్డికోయడానికి వచ్చాడా? అని ఎద్దేవా చేశారు.