Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అయోధ్య రాముడి గుడి తలుపులు తయారు మన హైద్రాబాద్ లోనే …!

అయోధ్య రాముడి గుడి తలుపులు తయారు చేస్తున్న హైదరాబాదీ కంపెనీ

  • మందిరం నిర్మాణ పనుల్లో కంటోన్మెంట్ కు చెందిన టింబర్ కంపెనీ
  • అయోధ్యలోనే ప్రత్యేక వర్క్ షాపు ఏర్పాటు చేసి పనులు
  • మొత్తం 300 లకు పైగా తలుపుల రూపకల్పన
  • ఇప్పటికే సిద్ధంచేసిన 118 తలుపులు.. జనవరి 1న బిగింపు
Hyderabadi Company In Ayodhya Ram Mandir Construction

అయోధ్య రామ మందిర నిర్మాణంలో మన హైదరాబాదీ కంపెనీ భాగస్వామ్యం కూడా ఉంది. గుడి ప్రధాన ద్వారంతో పాటు ఇతర తలుపులను తయారుచేసే అవకాశం సిటీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న అనురాధ టింబర్ ఎస్టేట్ కు దక్కింది. గుడి తలుపుల తయారీ కాంట్రాక్టును దక్కించుకున్న ఈ కంపెనీ.. అయోధ్యలో రామ మందిర పరిసరాల్లోనే ప్రత్యేకంగా వర్క్ షాప్ ను ఏర్పాటు చేసి మరీ పనులు చేస్తోంది. మొత్తం 300 లకు పైగా ద్వారాలు తయారు చేయాల్సి ఉందని, ఇప్పటికే 118 ద్వారాలు తయారయ్యాయని కంపెనీ నిర్వాహకులు చదలవాడ శరత్‌బాబు తెలిపారు. ఇటీవల యాదాద్రి పునర్నిర్మాణంలోనూ తాము పాలుపంచుకున్నామని చెప్పారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడికి ప్రధాన ద్వారాలు రూపొందించింది తామేనని వివరించారు.

రామాలయానికి ద్వారాలను రూపొందించేందుకు చాలా కంపెనీలు పోటిపడ్డాయి. అయితే, ఆలయ ద్వారాల తయారీలో అనుభవం, యాదాద్రి ద్వారాల నాణ్యతను పరిశీలించిన అయోధ్య ట్రస్ట్ సభ్యులు అనురాధ టింబర్ ఎస్టేట్ కు పనులు అప్పగించారు. ట్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ ఆదేశాలు, ఇచ్చిన డిజైన్ మేరకు ద్వారాల తయారీ పనులు ప్రారంభించినట్లు శరత్ బాబు వివరించారు. ఇందుకోసం ఆలయ పరిసరాల్లోనే ప్రత్యేకంగా వర్క్ షాప్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన ద్వారాలను జనవరి 1 న బిగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తలుపుల తయారీ కోసం మహారాష్ట్రలోని బల్లార్ష నుంచి ప్రత్యేకంగా టేకు కలపను తెప్పించినట్లు తెలిపారు. ఈ ద్వారాల తయారీ పనులలో తమిళనాడుకు చెందిన కుమార్‌ రమేష్‌, మహాబలిపురం, కన్యాకుమారికి చెందిన మరో 60 మంది శిల్పుల బృందం నిమగ్నమైందన్నారు.



Related posts

యమునా నది ఉగ్రరూపం… ఢిల్లీకి వరద ముప్పు…

Drukpadam

బాబ్బాబు.. మీరు ఆఫీసులకు రావొద్దు..

Ram Narayana

2023 లో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ ఫోన్లు

Ram Narayana

Leave a Comment