- భారీ అంబేద్కర్ విగ్రహం జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అన్న నాని
- చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరని వ్యాఖ్య
- కేశినేని చిన్ని వ్యాఖ్యలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు అంటూ ఎద్దేవా
విజయవాడలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహం ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అని ఎంపీ కేశినేని నాని చెప్పారు. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారని… వివక్షలేని పాలనను జగన్ అందిస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనంతటి అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పేదలను అత్యున్నత స్థాయిలో చూడాలని ఆశిస్తున్న నాయకుడు జగన్ అని అన్నారు.
గతంలో ఊరి చివరన అంబేద్కర్ విగ్రహాలను పెట్టేవారని… ఇప్పుడు జగన్ రాష్ట్ర నడిబొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారని కేశినేని నాని ప్రశంసించారు. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. తాను చంద్రబాబు చిట్టా విప్పితే టీడీపీ వాళ్లు తట్టుకోలేరని చెప్పారు.
టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్న తన సోదరుడు కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందిస్తూ… ఉత్తర కుమారుడి ప్రగల్భాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో అందరికీ తెలుస్తుందని చెప్పారు.