Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీసీసీ చీఫ్ గా షర్మిల భాద్యతలు … చంద్రబాబు ,జగన్ లపై బాణాలు …

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు అందుకున్న షర్మిల…

  • ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం
  • నేడు విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బాధ్యతల స్వీకరణ
  • ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకువస్తానని వెల్లడి
  • రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ దొందూ దొందేనంటూ విమర్శలు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేడు బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె ప్రసంగిస్తూ… ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకువస్తానని తన సంకల్పాన్ని ప్రకటించారు. తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఇదే పీసీసీ పదవిని చేపట్టారని, రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారని వెల్లడించారు. ఇప్పుడదే పదవిని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను చేపడుతున్నానని తెలిపారు. 

నన్ను నమ్మి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ షర్మిల పేర్కొన్నారు. తాను ఈ పదవి చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అభిమానులు కోరుకున్నారని, వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. 

ఈ పదేళ్లు టీడీపీ, వైసీపీ ఏం చేశాయి?

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధికారంలో ఉంది. అంతకుముందు ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? 

మన రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.లక్ష కోట్లు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఐదేళ్ల తర్వాత ఆ అప్పులు మరింత పెరిగాయి. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లకు పైనే. మొత్తంగా ఇవాళ్టికి రాష్ట్రం అప్పులు ఆరున్నర లక్షల కోట్లు. కార్పొరేషన్లపై తీసుకున్న లోన్లతో కూడా కలిపితే ఆంధ్రప్రదేశ్ పై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. ఇన్ని అప్పులు చేశారు, ఇన్ని డబ్బులు తెచ్చారు… మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అని భూతద్దంలో చూసినా ఎక్కడా కనిపించదు. 

దళితులపై దాడులు మాత్రం పెరిగాయి

రాష్ట్రానికి రాజధాని ఉందా, రాజధాని కట్టగలిగారా, రాష్ట్రంలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఈ పదేళ్లలో కనీసం 10 భారీ పరిశ్రమలు అయినా వచ్చాయా? పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 

ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేవు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా ఇవ్వగలుగుతున్నారా? దానికి కూడా డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు కానీ, దళితులపై దాడులు మాత్రం నూటికి నూరు శాతం పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం… ఇంతకంటే ఏం జరిగింది? 

ప్రత్యేక హోదా వచ్చుంటే ఇవన్నీ జరిగేవి

ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లయినా రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చుంటే పన్నుల్లో రాయితీలు లభించేవి. పరిశ్రమలు వచ్చేవి, పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. ప్రత్యేక హోదా రాలేదు అనేకంటే మన పాలకులు తీసుకురాలేకపోయారు అనడమే కరెక్టు. 

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే భారీగా పారిశ్రామికాభివృద్ధి జరిగింది. 2 వేల పరిశ్రమలు వచ్చాయి. దాంతో ఉద్యోగావకాశాలు 500 శాతం పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ 10 వేల పరిశ్రమలు వచ్చాయి. మరి మనకేదీ స్పెషల్ స్టేటస్? ఎందుకు రాలేదు మనకు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే మన పాలకులకు చేతకాలేదు కాబట్టి. 

ప్రత్యేక హోదాపై ఊదరగొట్టారు

ఆ రోజు రాష్ట్రానికి ఐదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే బీజేపీ నాడు ఏమన్నది? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని కోరింది బీజేపీ కాదా? తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ వాళ్లు ఊదరగొట్టారు. 

ఇక చంద్రబాబు అయితే పదిహేనేళ్లు స్పెషల్ స్టేటస్ కావాలని కొట్లాడాడు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నా అన్నాడు. ఆ విధంగా టీడీపీ వాళ్లు కేంద్రంలో మంత్రులు కూడా అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా? ఉద్యమం చేయకపోగా, ఉద్యమం చేసేవారిపై కేసులు పెట్టి జైల్లో వేయించారు. 

జగన్ రెడ్డి సీఎం అయ్యాక హోదా కోసం చేసింది శూన్యం

ఆ సమయంలో విపక్ష నేతగా ఉన్నది జగన్ రెడ్డి గారు. ఆయన విపక్ష నేతగా ఉన్నంతకాలం ప్రత్యేక హోదా కోసం ప్రతి రోజూ కొట్లాడారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా… మేం అవిశ్వాస తీర్మానం పెడతాం… టీడీపీ ఎంపీలందరూ మద్దతు ఇవ్వండి అని జగన్ రెడ్డి కోరారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు స్పెషల్ స్టేటస్ అని నాడు జగన్ రెడ్డి అన్నది నిజం కాదా? 

మరి ఈ జగన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాడా? స్వలాభం కోసం వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. ఇవాళ మనకు ప్రత్యేక హోదా లేదు కదా… కనీసం ఒక స్పెషల్ ప్యాకేజి కూడా లేదు. ఇవాళ ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే అందుకు ముమ్మాటికీ చంద్రబాబు, జగనే కారణం. ఈ పాపం వారిదే. సొంతలాభం కోసం ఇద్దరూ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ… దొందూ దొందే. 

మూడు రాజధానులు అన్నారు… ఒక్కటీ కట్టలేదు

చంద్రబాబు అమరావతి రాజధాని అన్నాడు. సింగపూర్ చేస్తానన్నాడు. త్రీడీ గ్రాఫిక్స్ చూపించాడు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అదీ లేదు. ఆ తర్వాత జగన్ రెడ్డి వచ్చి మూడు రాజధానులు అన్నాడు. అలాగైనా మూడు రాజధానులు కట్టారా అంటే అదీ లేదు. ఈ రోజు రాజధాని అంటే ఏం చెప్పాలో మనకే అర్థంకాని పరిస్థితి! ఒక్క రాజధాని అయినా ఉందా అంటే ఒక్కటీ లేదు! మరి ఏం సాధించుకున్నట్టు! 

పోలవరం అతీ గతీ లేదు!

ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే… ఎప్పుడో 1941లో పోలవరం కట్టాలనుకుంటే సాధ్యం కాలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు 2004లో సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు స్థాపించారు. ఆయన ఉన్నప్పుడు పోలవరం కుడి, ఎడమ కాలువ పనులు చేశారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇటు జగన్ రెడ్డి కూడా అదే పని చేశారు. బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టేశారు” అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

Related posts

త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను: పవన్ కల్యాణ్

Ram Narayana

పోరాటాలకు సమయం ఆసన్నమయింది… జగన్

Ram Narayana

రాజకీయ కార్యకలాపాలను చక్కబెట్టే పనిలో చంద్రబాబు ఫుల్ బిజీ: వైసీపీ తీవ్ర విమర్శలు

Ram Narayana

Leave a Comment