మా సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తాం
- ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాము సహనంగా ఉన్నామన్న మల్లు భట్టి
- పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా
- కాంగ్రెస్ తరఫున ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఆ దిశగా ముందుకు సాగుతున్నామని వ్యాఖ్య
తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాము సహనంగా ఉన్నామన్నారు. కానీ దీనిని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఆ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.
తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండింటిని అమలు చేశామని మల్లు భట్టి తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. మనది ప్రజాస్వామ్య దేశం… ప్రజాస్వామ్య రాష్ట్రం.. కానీ ఇష్టారీతిన మాట్లాడవద్దన్నారు. తాము కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ మిగలదన్నారు.