- షర్మిలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్న వెల్లంపల్లి
- వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయించింది కాంగ్రెస్ అని విమర్శ
- బొండా ఉమా గెలవడం అసాధ్యమని వ్యాఖ్య
గతంలో వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని… ఇప్పుడు షర్మిలను మోసం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. షర్మిల అంటే తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. తన అన్న జగన్, వైసీపీ పాలనపై ఆమె ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. దివంగత వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించిందని… సోనియాగాంధీకి తెలియకుండానే వైఎస్సార్ పై కేసు పెట్టారా? అని ప్రశ్నించారు.
జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టింది వాస్తవం కాదా? అని అడిగారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎలా చేరారని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు వెల్లంపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
విజయవాడ సెంట్రల్ లో టీడీపీ నేత బొండా ఉమా గెలవడం కలేనని వెల్లంపల్లి అన్నారు. ఇక్కడ పోటీ చేసే అర్హత కూడా ఉమాకు లేదని చెప్పారు. ఐదేళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉమా లేరని అన్నారు. కాల్ మనీలు, గూండాయిజం, దొంగతనాలు, భూకబ్జాలు, బైక్ రేసులు చేసింది టీడీపీ నేతలే అని చెప్పారు. అందరి జీవితాలు బాగుండాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు.