65 దాటినా ఆరోగ్య బీమా…హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు
=క్యాన్సర్, గుండెజబ్బులు, ఎయిడ్స్ బాధితులకూ బీమా సదుపాయం కల్పించాలి
=ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాలవ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గింపు
=జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందే
=వేర్వేరు వ్యాధుల చికిత్సకు నిర్ణీత బీమా సొమ్ము ఇచ్చేలా కంపెనీలు చర్యలు చేపట్టాలి
=మారటోరియం 8 ఏళ్ల నుంచి ఐదేళ్లకు.. ఐఆర్‌డీఏఐ కీలక నిర్ణయాలు
=నోటిఫికేషన్ విడుదల.. బీమా రంగ నిపుణుల హర్షం
ఆరోగ్య బీమా రంగంలో పాలసీదారుల ప్రయోజనానికి పెద్ద పీట వేస్తూ ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సాధికారిక సంస్థ’ (ఐఆర్‌డీఏఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 65 ఏళ్ల వయో పరిమితిని తొలగించింది. తద్వారా ఇకపై 65 ఏళ్లకు పైబడిన వారు కూడా ఆరోగ్య బీమా చేసుకోవటానికి వీలవుతుంది. ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఇక మీదట అన్ని వయసుల వారికి సరిపోయే ఆరోగ్య బీమా పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకొస్తాయని ఆశిస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అవసరమైన సేవలను అందించాలని, బీమా చెల్లింపులకు (క్లెయిమ్స్‌కు) సంబంధించి వారి కోసమే ప్రత్యేకంగా కొన్ని విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించింది. క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు, ఎయిడ్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్య బీమా పథకాలను అందించాలని, ఆ వర్గాలకు ఇన్సూరెన్స్ నిరాకరించటం ఇక మీదట కుదరదని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. ఆరోగ్య బీమా తీసుకున్న తర్వాత అన్ని వ్యాధులకూ అది వర్తించటానికి ప్రస్తుతం అమలులో ఉన్న 48 నెలల వెయిటింగ్ పీరియడ్‌ను 36 నెలలకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది. పాలసీదారు తన జబ్బుల గురించి వెల్లడించినా, వెల్లడించకపోయినా..
బీమా తీసుకున్న 36 నెలల తర్వాత అన్ని జబ్బులకూ బీమా ఇవ్వాల్సిందేనని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో తీసుకున్న చికిత్స వ్యయాన్ని భరించేలా ఆరోగ్య బీమా పథకాలు ఉంటున్న విషయం తెలిసిందే. దీని బదులుగా నిర్ణీత వ్యాధులకు నిర్ణీత బీమా సొమ్ము కంపెనీలు అందించాలని, తద్వారా పాలసీదారులకు తమ వద్ద ఉన్న బీమా పథకం గురించి ముందే స్పష్టత ఉంటుందని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మార్పు దిశగా క్రమంగా కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. ఆరోగ్య బీమాపై మారటోరియం వ్యవధిని కూడా ఇప్పుడున్న 8 ఏళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. అంటే, ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లిస్తే బీమా పథకంలోని అన్ని సేవలనూ పాలసీదారులకు కంపెనీ అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఆర్‌డీఏఐ తీసుకున్న నిర్ణయాలపై బీమా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలతో దేశంలో మరింత సమ్మిళిత ఆరోగ్య సేవలకు అవసరమైన వాతావరణం నెలకొంటుందని, ఇన్సూరెన్స్ కంపెనీలు వైవిధ్యపూరిత సేవలు అందించటానికి వీలు కలుగుతుందన్నారు