Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

బీజేపీని ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతు …తమ్మినేని

దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తూ…రాక్షస శక్తిగా ముందుకొస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో భువనగిరి పార్లమెంట్‌ స్థానం మినహా మిగిలిన 16 చోట్లా కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సీపీఐ(ఎం) ఖమ్మం పార్లమెంట్‌ విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అభ్యర్థి రఘురాంరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అతిథులుగా హాజరయ్యారు.

పదేళ్ల మోడీ పాలనలో దేశానికి ప్రమాదకరంగా మారిన ఎన్డీఏ ప్రధాన శత్రువుగా ఇండియా కూటమి ఆవిర్భవించిందన్నారు. దీని ప్రధాన లక్ష్యం ఎన్డీఏను ఈ ఎన్నికల్లో గద్దె దించడమేనని తెలిపారు. బీజేపీ విధానపరంగా దేశ ఉనికికే ప్రమాదకరమన్నారు. బీజేపీ వెనుక ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చే ఓ ఫాసిస్టు సిద్ధాంతం ఉందన్నారు. బీజేపీ హిందూ రాజ్యమంటే ఆ మతంలోని అగ్రకులాల రాజ్యమని వివరించారు. భారత రాజ్యాంగంలో ముఖ్య సారాంశం సమానత్వాన్ని రూపుమాపే సనాతన మనుధర్మాన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తోందన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అడ్డుతొలగించుకుంటే మనుధర్మాన్ని స్వేచ్ఛగా అమలు చేయాలనేదే బీజేపీ వ్యూహంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాలే కాదు రాజకీయ పార్టీలన్నింటినీ నిర్వీర్యం చేసి ఏకవ్యక్తి రాజ్యంలా దేశాన్ని మార్చాలని మోడీ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఆర్థిక దోపిడీని విశృంఖలం చేసేందుకు పూనుకుందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేసే చర్యలు…చివరకు వాక్‌స్వాతంత్య్రాన్ని సైతం హరించేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. బీజేపీని ఓడించడం ద్వారానే దేశ ఐక్యత సాధ్యమన్నారు. రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని, అధికారంలో ఉన్న పార్టీ చుట్టూ తిరిగే పరిస్థితులు ఉత్పన్నమైయ్యాయని తెలిపారు. రామహాసహాయం రఘురాంరెడ్డి స్థానికుడు…ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ ఆయన స్వస్థలమని తెలిపారు. ఆయన గెలుపు బాధ్యతను సీపీఐ(ఎం) స్వీకరిస్తుందని, ఆయన అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేలా చూస్తానని తమ్మినేని మాట ఇచ్చారు…

దేశ రక్షణకు అందరం ఏకం కావాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను స్వయంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరానన్నారు. దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సంఘటితంగా వెళ్దామని ముందుకు వచ్చిన సీపీఐ(ఎం) నాయకత్వానికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు. దేశ సంపద ప్రజలకు చెందేలా చూడటమే కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల లక్ష్యమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్న బీజేపీని సాగనంపడమే ధ్యేయంగా ముందుకెళ్దామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

తమ్మినేని సారథ్యంలో సీపీఐ(ఎం) సహకారంతోనే 2014లో నేను ఎంపీనయ్యానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు. అలాగే రామసహాయం రఘురాంరెడ్డికి కూడా వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. దేశంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక కామ్రేడ్లు కోరుకున్న పాలనను అందిస్తామన్నారు. అక్షింతల పేరుతో మాయ మాటలు చెప్పి బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తుందన్నారు. ఈసారి ఎన్డీఏ కూటమిని ఇంటికి పంపి..నూటికి నూరుశాతం ‘ఇండియా కూటమి’ అధికారంలోకి వస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి సారథ్యంలో పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.

సీపీఐ(ఎం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, పార్టీ సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య, ఎం.సుబ్బారావు, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, బుగ్గవీటి సరళ, బంతు రాంబాబు, కళ్యాణం వెంకటేశ్వర్లు, వై.విక్రమ్‌, కొత్తగూడెం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజే రమేశ్‌, మచ్చా వెంకటేశ్వర్లు, కారం పుల్లయ్య, కె.పుల్లయ్య, బ్రహ్మచారి, కాంగ్రెస్‌ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వరరావు , మద్దినేని బేబిస్వర్ణకుమారి, మిక్కిలినేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాలేరులో ఉమ్మడి అభ్యర్థి పొంగులేటిని గెలిపించండి ;సిపిఐ సమావేశంలో పోటు ప్రసాద్..

Ram Narayana

నామ గెలుపుకోసం ఎంపీ వద్దిరాజు బురహాన్ పురంలో విస్త్రత ప్రచారం…

Ram Narayana

పువ్వాడ నామినేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదు తిరస్కరించండి… తుమ్మల

Ram Narayana

Leave a Comment