బ్యాలెట్ పేపర్లో మార్పులపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిటిషన్… త్వరగా నిర్ణయం తీసుకోండి: ఈసీకి హైకోర్టు సూచన
- చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో ఇద్దరు నామినేషన్
- బ్యాలెట్ పేపర్లో రెండు పేర్ల మధ్య 10 నెంబర్ల వ్యత్యాసం ఉండేలా ఈసీని ఆదేశించాలని బీజేపీ అభ్యర్థి పిటిషన్
- ఈ దశలో మార్పులపై ఉత్తర్వులు ఇవ్వలేమన్న న్యాయస్థానం
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న ఇద్దరు నామినేషన్ వేసినందున ఒక్కో పేరు మధ్య కనీసం 10 నెంబర్ల వ్యత్యాసం బ్యాలెట్‌లో ఉండేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. బ్యాలెట్ పేపరులో మార్పులపై ఆయన వినతి పత్రాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికలసంఘాన్ని న్యాయస్థానానికి సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి విశ్వేశ్వరరెడ్డితో పాటు 46 మంది నామినేషన్ దాఖలు చేశారని, పిటిషనర్ పేరు పోలిన మరో వ్యక్తి కూడా నామినేషన్ వేశారని బీజేపీ ఎంపీ అభ్యర్థి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బ్యాలెట్‌లో నెంబర్ 2గా పిటిషనర్ పేరు ఉందని, ఐదో పేరుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి తండ్రి కాంతారెడ్డి పేరు ఉందన్నారు. పిటిషనర్ ప్రచారానికి వెళుతుంటే 5వ నెంబర్ అభ్యర్థి కదా? అని అడుగుతున్నారని, కాబట్టి ఈ రెండు పేర్ల మధ్య వ్యత్యాసం కనీసం 10 నెంబర్లు ఉండేలా ఈసీకి సూచించాలని కోర్టును కోరారు. దీనికి సంబంధించి గత నెల 30న ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. వినతిపత్రంపై నిర్ణయం తీసుకునే వరకు సీరియల్ నెంబర్లు కేటాయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉన్నందున పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు న్యాయస్థానం బ్యాలెట్ పేపర్‌లో మార్పులు చేయాలని ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. అయితే పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది.