- అజర్ బైజాన్ సరిహద్దుల్లో ఓ డ్యామ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇబ్రహీం రైసీ
- తిరిగి వస్తుండగా పర్వత ప్రాంతంలో దట్టమైన మంచులో చిక్కుకున్న హెలికాప్టర్
- అదే హెలికాప్టర్ లో ఇరాన్ విదేశాంగ మంత్రి
- ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి బతికే అవకాశాలు లేవంటున్న అధికారులు!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హోసీన్ అమీర్ అబ్దొల్లాహియాన్ కూడా అదే హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు.
వీరు ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దుల్లో ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పర్వత ప్రాంతాల్లో దట్టమైన మంచులో చిక్కుకుని హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి బతికి బయటపడే అవకాశాలు చాలా తక్కువ అని ఓ అధికారి వెల్లడించారు. తమకు ఇప్పటికీ ఆశలు ఉన్నాయని, కానీ సంఘటన స్థలం నుంచి అందిన సమచారం ఆందోళన కలిగించేదిగా ఉందని అన్నారు. కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
63 ఏళ్ల ఇబ్రహీం రైసీ తన రెండో ప్రయత్నంలో 2021 ఎన్నికల్లో గెలిచి ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నైతికత చట్టాలను మరింత కట్టుదిట్టం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక గళాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడం, ప్రపంచ శక్తులతో అణుచర్చలు వంటి అంశాలతో ఇబ్రహీం రైసీ పాలన కొనసాగుతోంది.