- కోస్టారీకా యువకుడి వాటర్ ఫాస్టింగ్
- నీళ్లు మాత్రమే తాగుతూ 21 రోజుల పాటు ఉపవాసం
- ఉపవాసం కారణంగా లాంగ్ కొవిడ్ నుంచి ఉపశమనం దక్కిందన్న యువకుడు
- ఓ కొత్త ఆధ్యాత్మికత పరిచయమైందని వ్యాఖ్య
- యూట్యూబ్ లో యువకుడి వీడియో వైరల్
నీటిని మాత్రమే తాగుతూ 21 రోజుల పాటు కఠిన ఉపవాసం చేసిన ఓ యువకుడు ఏకంగా 13 కేజీల బరువు తగ్గాడు. అంతేకాకుండా, సుదీర్ఘ కొవిడ్ కారణంగా కోల్పోయిన ఆఘ్రాణించే శక్తిని కూడా తిరిగి పొందాడు. కోస్టారీకాకు చెందిన అడిస్ మిల్లర్ తన ఉపవాసం తాలూకు వివరాలను యూట్యూబ్‌లో పంచుకున్నాడు. ఈ ఉపవాసంతో తన జీవితమే మారిపోయిందని, ఓ కొత్త ఆధ్యాత్మికత అలవడిందని చెప్పుకొచ్చాడు.
‘‘ఉపవాసం మొదలెట్టిన తొలి రోజుల్లో నా ఒంట్లో నుంచి అంతా క్లియర్ అవుతున్నట్టు అనిపించింది. అలాగే పేగులు ఆకలితో అరిచేవి. దాంతో బాగా అలసిపోయిన ఫీలింగ్ ఆవహించేది. అలాగే ఉపవాశం కొనసాగించాను. రోజులో పలు మార్లు కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతూ గడిపేవాడిని. అలా రోజుకు 4 లీటర్ల నీరు తాగుతున్నా సరిపోకపోవడంతో మరింత ఎక్కువగా తాగడం ప్రారంభించా. రోజులు గడుస్తున్న కొద్దీ నా దేహం బలహీనంగా మారసాగింది’’
‘‘14వ రోజున నా ఉపవాసం అనూహ్య మలుపు తిరిగింది. ప్రకృతితో అనుసంధానమవుతున్నట్టు అనిపించింది. అదో కొత్త అనుభవం. అంతా చాలా సులభంగా జరిగిపోతున్నట్టు అనిపించింది. 19వ రోజు వచ్చే సరికి నాకు అసలు ఆకలే అనిపించేది కాదు. మరిన్ని రోజులు ఉపవాస దీక్ష కొనసాగించాలని అనిపించింది. శారీరకంగా బలహీనపడుతున్నా శరీరంలో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్టు అనిపించేది’’ అని అతను చెప్పుకొచ్చాడు.
ఈ ఉపవాసం కారణంగా లాంగ్ కొవిడ్ సమస్యల నుంచి బయటపడ్డానని చెప్పాడు. కొవిడ్ కారణంగా తాను వాసనలు గుర్తించే శక్తి కోల్పోయానని చెప్పుకొచ్చాడు. ఉపవాసం తరువాత ఆ శక్తి తిరిగొచ్చిందని అన్నాడు. వినికిడి శక్తి, మెదడు శక్తి కూడా పెరిగినట్టు అనిపిస్తోందని పేర్కొన్నాడు.
వాటర్ ఫాస్టింగ్..
ఇటీవల ఫిట్‌నెస్ ఔత్సాహికుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న ఈ ఉపవాసాన్ని వాటర్ ఫాస్టింగ్ అంటారు. ఈ తరహా ఉపవాసాలు ఉండేవారు మంచి నీళ్లు మినహా మరేమీ ముట్టరు. ఈ కఠిన ఉపవాసాలతో శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయని కొందరు భావిస్తున్నారు. కొత్త ఆధ్యాత్మికత పరిచయమవుతుందని కూడా పేర్కొంటున్నారు.